- 152 మీటర్ల వద్ద ప్రాజెక్టు కట్టాలి
- ముంపు పరిహారం ఇస్తామన్న తెలంగాణ
- పర్యావరణ అనుమతులు ఇప్పించాలని వినతి
- రూ.10,849 కోట్ల సాయం కోరిన సీఎం
- సమ్మక్క సాగర్‌కు ఎన్‌ఓసీపై చొరవ తీసుకోండి
- సానుకూలంగా స్పందించిన ప్రధాని
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు, అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపునకు మహారాష్ట్రను ఒప్పించడంతో పాటు, పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, ఆర్థిక సాయం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులు వేగవంతం చేశామని, భూ నిర్వాసితులకు పరిహారం త్వరగా అందిస్తున్నామని వివరించారు.
ఆదివారం ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్‌లో ప్రధాని నివాసంలో మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా యూత్‌గేమ్స్–2026 వేడుకలకు రావాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం, పర్యావరణ అనుమతులు, తుమ్మిడిహెట్టి, సమ్మక్క–సారలమ్మ ప్రాజెక్టుల విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు. వివిధ ప్రాజెక్టుల పూర్తికి రూ.10, 849 కోట్ల ఆర్థిక సాయం అందించాలని రిక్వెస్ట్ చేశారు. ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరారు.
152 మీటర్లకు ఒప్పించండి
ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తుతో నిర్మించేలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇటీవల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రాజెక్టుతో మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే ప్రాంతాలకు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్ర సాగునీటి అవసరాల దృష్ట్యా ప్రాజెక్టుకు మహారాష్ట్ర అంగీకరించేలా చూడాలని కోరారు. దీంతో తెలంగాణలోని వెనుకబడిన, గిరిజన ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా సాగు, తాగునీరు అందించే అవకాశం ఉంటుందని వివరించారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐఎస్), సీతమ్మ సాగర్ బహుళార్థసాధక ప్రాజెక్టు (ఎస్‌ఎస్‌ఎంపీ), డిండి ఎత్తిపోతల పథకం (డీఎల్ఐఎస్)లపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేసినా పర్యావరణ, ఇతర చట్టబద్ధ అనుమతులు పెండింగ్‌లో ఉండటంతో తాగునీటి ప్రయోజనాలు అందడం లేదని ప్రధానికి సీఎం వివరించారు. ఈ అనుమతుల విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చినందున ఆలస్యం లేకుండా పర్యావరణ, ఇతర అనుమతులు మంజూరయ్యేలా చూడాలని కోరారు.
ప్రాజెక్టులకు రూ.10,849 కోట్లు ఇవ్వండి
ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన (పీఎంకేఎస్‌వై), స్కీం ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ (సాస్కీ) కింద తెలంగాణకు రూ.10,849 కోట్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. పీఎంకేఎస్‌వై కింద ఇంటిగ్రేటెడ్ సమ్మక్క సాగర్ ప్రాజెక్టు, సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.5,183 కోట్లు, మోడికుంట వాగుకు రూ.392 కోట్లు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.171 కోట్లు, చనాకా–కొరాటా బ్యారేజీకి రూ.103 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సాస్కీ కింద అదనంగా రూ.5,000 కోట్లు మంజూరు చేయాలని కోరారు. 70 నుంచి 90 శాతం పూర్తయిన ప్రాజెక్టుల కోసం ఈ నిధులు వాడుకుంటామని తెలిపారు. దీంతో సాగునీటి సరఫరా మెరుగై రైతుల ఆదాయం, గ్రామీణ ఉపాధి అవకాశాలు, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతాయని పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్ ఎన్‌ఓసీకి చొరవ చూపండి
సమ్మక్క సాగర్ ప్రాజెక్టు డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) సమర్పించామని సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే భూములు, గ్రామాలను గుర్తించేందుకు పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్), బ్యాక్‌వాటర్ స్థాయితో కూడిన సమగ్ర సర్వేకు రూ.9.88 కోట్లు చెల్లించినట్లు వివరించారు. ఆ రాష్ట్రానికి భూ పరిహారం ఇచ్చేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని, ఛత్తీస్‌గఢ్ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) త్వరగా వచ్చేలా చొరవ చూపాలని కోరారు.
ఖేలో ఇండియా గేమ్స్‌కు ఆహ్వానం
హైదరాబాద్‌లో డిసెంబర్ 11–22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 ప్రారంభ, ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఆహ్వాన పత్రిక అందజేసి, గేమ్స్ లోగో, మస్కట్ గురించి వివరించారు. దేశవ్యాప్తంగా 7,000 మందికి పైగా యువ క్రీడాకారులు పాల్గొంటారని, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఈ గేమ్స్ వేదికగా నిలుస్తాయని తెలిపారు. 2002లో జాతీయ క్రీడలు, 2007లో ప్రపంచ మిలిటరీ క్రీడలను విజయవంతంగా నిర్వహించిన తెలంగాణ అనుభవాన్ని ప్రధానికి గుర్తుచేశారు.
‘ఖేలో ఇండియా’కు తప్పకుండా వస్తా: మోదీ
తెలంగాణ వేదికగా జరగబోయే ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026కు తప్పకుండా హాజరవుతానని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రుల బృందానికి ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ముందుగా నిర్ణయించిన తన షెడ్యూల్ ను పరిశీలించి, పర్యటన ఖరారు చేసి, రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తానన్నారు. సాధ్యమైనంత వరకు ప్రారంభ, ముగింపు వేడుకలకు వచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ఈ గేమ్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ సమావేశంలో.. అధికారిక లోగో, మస్కట్‌ల రూపకల్పనపై సంతోషం వ్యక్తం చేశారు.
కాళేశ్వరంపై ప్రధాని ఆరా
సీఎం రేవంత్‌తో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ పలు ప్రాజెక్టుల ఆలస్యంపై ఆరా తీసినట్లు తెలిసింది. ప్రాణహిత -చేవెళ్లకు రూ.11 వేల కోట్లు వెచ్చించి 30 శాతం పనులు పూర్తయ్యాక కూడా తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడంపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా కాళేశ్వరం బ్యారేజీలు కుంగడం వంటి అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయితే సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను ప్రధాని అభినందించారు. ఈ దిశగా కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు, పలు పథకాల కింద నిధులను సమకూర్చుతామని హామీ ఇచ్చారు. ఎల్‌నినోతో పాటు.. తుమ్మిడి హెట్టి ఎత్తు పెంపు, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ఎన్వోసీ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
‘ఖేలో ఇండియా’ లోగో, మస్కట్ ఆవిష్కరణ
ప్రధానితో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 అధికారిక లోగో, మస్కట్‌ను ఆవిష్కరించారు. తుగ్లక్ రోడ్‌లోని కేంద్ర మంత్రి అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, సీఎస్ సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, వాణీ ప్రసాద్, సోనీబాలా దేవి తదితరులు పాల్గొన్నారు.
