టీమిండియాతో తొలి టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్!

టీమిండియాతో తొలి టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్!

India vs New Zealand: నవంబర్ 19వ తేదీ నుంచి భారత్‌తో ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్ ఆల్‌రౌండర్, పరిమిత ఓవర్ల కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (Mitchell Santner) చేతి గాయం కారణంగా మొత్తం టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. టీమిండియాతో జరిగిన ఐదో వన్డేలో ఇండియన్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ వేసిన బంతి బలంగా తగలడంతో శాంట్నర్ కుడి చేతికి ఫ్రాక్చర్ అయినట్లు స్కానింగ్‌లో నిర్ధారణ అయింది.

కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందంటే: 

ఆదివారం (నవంబర్ 15) జరిగిన ఐదో వన్డేలో న్యూజిలాండ్ ఛేదన సమయంలో 37వ ఓవర్లో అర్ష్‌దీప్ సింగ్ వేసిన బంతి శాంట్నర్ కుడి చేతి వెనుక భాగంలో బలంగా తాకింది. ఆ సమయంలో ఫిజియో చికిత్స అందించడంతో మిచెల్ బ్యాటింగ్ కొనసాగించి 24 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే మ్యాచ్ తర్వాత నిర్వహించిన స్కానింగ్‌లో చేతికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. శాంట్నర్ తిరిగి పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి ఎంత సమయం పడుతుందనే దానిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (NZC) ప్రకటించింది.

శాంట్నర్ స్థానంలో డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్‌కు చోటు: 

మిచెల్ శాంట్నర్ టెస్ట్ సిరీస్ కు దూరం కావడంతో అతడి స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (Dean Foxcroft) ను న్యూజిలాండ్ టెస్టు జట్టులోకి తీసుకుంది. భారత్‌తో జరిగిన చివరి రెండు వన్డేల్లో ఆడిన ఫాక్స్‌క్రాఫ్ట్ 39 పరుగులు (ఐదో వన్డేలో 31 రన్స్) చేశాడు. అంతేకాకుండా, గత అక్టోబర్‌లో ఇండియా-ఎ, న్యూజిలాండ్-ఎ జట్ల మధ్య జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 51, 42, 93, 10 పరుగులు సాధించి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో నవంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టు తుది జట్టులో (Playing XI) ఫాక్స్‌క్రాఫ్ట్‌కు అవకాశం దక్కే సూచనలు మెండుగా ఉన్నాయి. 
 
న్యూజిలాండ్ ప్లేయింగ్ XI: 

టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (శాంట్నర్ స్థానంలో), రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్