అమెరికాలో డర్టీ బాంబ్ దాడికి ఇరాన్ ప్లాన్.. ట్రంప్ ప్రభుత్వ అధికారులే టార్గెట్..!

అమెరికాలో డర్టీ బాంబ్ దాడికి ఇరాన్ ప్లాన్.. ట్రంప్ ప్రభుత్వ అధికారులే టార్గెట్..!

టెహ్రాన్: అమెరికాపై ఇరాన్ దాడికి సిద్ధం అవుతుందా..? తమపై చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుందా..? వందల మంది తమ దేశ పౌరుల మృతి కారణమైన అమెరికా అధికారులను వారి సొంత దేశంలోనే అంతమొందించాలనుకుంటుందా..? అంటే అమెరికా ఇంటలిజెన్స్ వర్గాల నుంచి ఔను అనే సమాధానం వినిపిస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తత వేళ యూఎస్ ఇంటలిజెన్స్ సంచలన నివేదిక వెల్లడించింది. 

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో డర్టీ బాంబ్ లేదా రసాయన ఆయుధ దాడికి ఇరాన్ ప్రణాళికలు రచిస్తోందని అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోని ఏడుగురు కీలక అధికారులు, నిర్దిష్ట ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ కుట్ర పన్నినట్లు వెల్లడించాయి. అయితే, ఇరాన్ ఈ దాడులు తక్షణమే చేసే అవకాశం లేదని.. కేవలం వ్యూహాత్మక ఆప్షన్లను సిద్ధం చేసుకునే దశలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. తక్షణమే దాడి జరుగుతుందనడానికి ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొన్నారు.

ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా రెడీ

అమెరికా భూభాగంపై ఇరాన్ దాడులకు కుట్ర చేస్తోందన్న ఇంటలిజెన్స్ నివేదికపై ట్రంప్ ప్రభుత్వం స్పందించింది. ప్రస్తుతం అమెరికా మాతృభూమికి ఎలాంటి ముప్పు లేదని, పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని వైట్‌హౌస్ ప్రతినిధి లారెన్ బిస్ తెలిపారు. వాషింగ్టన్‌లోనే కాకుండా మిడిల్ ఈస్ట్‎లో మోహరించిన అమెరికా సైనికులపై కూడా ఇరాన్ రసాయన ఆయుధాలను ఉపయోగించే అవకాశాలపై అమెరికా నిఘా వర్గాలు అలర్ట్ అయ్యాయి. ఇంటలిజెన్స్ వర్గాల అనుమానాలను నిజం చేస్తూ అమెరికా భూభాగంలో ఇరాన్ దాడి చేస్తే ఈ యుద్ధం మరో మలుపు తిరుగుతుందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్య తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చని పేర్కొంటున్నారు.  

డర్టీ బాంబు అంటే..

డర్టీ బాంబ్ అనేది సాంప్రదాయ పేలుడు పదార్థాలు, రేడియోధార్మిక పదార్థాల కలయికతో తయారు చేసే ఒక ఆయుధం. సంప్రదాయ పేలుడు పదార్థాలతో పాటు యురేనియం వంటి అణుధార్మిక పదార్థాలు కూడా డర్టీ బాంబులో ఉంటాయి. డర్టీ బాంబ్ న్యూక్లియర్ బాంబు కంటే పూర్తిగా భిన్నమైనది. అణు బాంబులో అణు విచ్ఛిత్తి జరిగి భారీ విధ్వంసం సృష్టిస్తుంది. కానీ డర్టీ బాంబ్‌లో అటువంటి అణు విస్ఫోటనం జరగదు. అది పేలినప్పుడు వాటిలో ఉన్న అణుధార్మిక పదార్థం గాలిలోకి వ్యాపిస్తుంది. మైళ్ల దూరం వరకు గాలిలో రేడియేషన్‌ను వ్యాపింపజేస్తుంది. అయితే, దీనివల్ల జరిగే ప్రాణనష్టం రేడియేషన్ కంటే సాధారణ బాంబు పేలుడు తీవ్రత వల్లనే ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

ఇది కచ్చితమైన లక్ష్యాలను ఛేదించే ఆయుధంగా కాకుండా ప్రజలలో తీవ్ర భయాందోళనలు సృష్టించడానికి ఉద్దేశించినది. దీనివల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఆ ప్రాంతం కొంతకాలం పాటు నివాసయోగ్యం కాకుండా పోతుంది. దీని తయారీ కోసం అత్యంత శుద్ధి చేసిన అణుధార్మిక పదార్థం అవసరం లేదు. ఆస్పత్రులు, అణు విద్యుత్ ప్లాంట్లు, పరిశోధన లేబరేటరీల్లో ఉండే అణుధార్మిక పదార్థాలను కూడా ఈ బాంబు తయారీకి వాడొచ్చు. ఈ డర్టీ బాంబులను వాహనాల్లో సైతం ఒకచోటు నుంచి మరోచోటుకు తీసుకెళ్లొచ్చు.