అమెరికాలో బ్యాంకు సర్వర్లు డౌన్: పేమెంట్స్ కాకపోవటంతో కస్టమర్లు గగ్గోలు

అమెరికాలో బ్యాంకు సర్వర్లు డౌన్: పేమెంట్స్ కాకపోవటంతో కస్టమర్లు గగ్గోలు

వాషింగ్టన్: అమెరికాలో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అన్ని బ్యాంకుల సర్వర్లు డౌన్ అయ్యాయి. నెట్ వర్క్ ఇష్యూతో లావాదేవీలకు బ్రేక్ పడింది. షాపులు, మాల్స్‎లో వస్తువులు కొనుగోలు చేయటానికి వెళ్లిన కస్టమర్లకు.. పేమెంట్స్ కాకపోవటంతో ఇబ్బంది పడుతున్నారు. మొన్నటికి మొన్న మైక్రోసాఫ్ట్ డౌన్‎తో అల్లకల్లోలంగా మారిన వ్యవస్థ సెట్ రైట్ అయిన ఒక్క రోజులోనే.. అమెరికాలో అన్ని బ్యాంకుల్లో సాఫ్ట్ వేర్ సమస్య తలెత్తటం ఆందోళన కలిగిస్తోంది.

అమెరికాలోని ఛేజ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్ ఫార్గో, యూఎస్ సహా పలు పెద్ద బ్యాంకుల సేవలు 2026, నవంబర్ 17న అంతరాయానికి గురయ్యాయి. వినియోగదారులు తమ బ్యాంకింగ్ సేవలు సరిగ్గా పనిచేయట్లేదని పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు నమోదు చేశారు. ఆన్‌లైన్ అవుటేజ్ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ డౌన్ డిటెక్టర్ ప్రకారం.. మంగళవారం (నవంబర్ 17) ఉదయం దాదాపు 9 గంటల సమయానికి ఈ ఫిర్యాదుల సంఖ్య హఠాత్తుగా పెరిగింది. 

జేపీ మోర్గాన్, టీడీ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‎ప్రెస్ వినియోగదారుల నుంచి కూడా ఫిర్యాదులు అందాయి. బ్యాంకు సర్వర్లు డౌన్ కావడానికి గల కారణమేంటన్నది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియరాలేదు. అకౌంట్ యాక్సెస్ సమస్యా, మొబైల్ యాప్ ఫెయిల్యూరా, డిజిటల్ పేమెంట్లకు అంతరాయమా.. ఏ సేవలు ఏ మేరకు ప్రభావితమయ్యాయో తెలియాల్సి ఉంది. 

జేపీమోర్గాన్ చేజ్ ఆన్-ప్రెమిస్ హార్డ్‌వేర్ సిస్టమ్‌లలో ఏర్పడిన తాత్కాలిక సాఫ్ట్‌వేర్ బగ్ ఈ సమస్యకు ప్రధాన కారణమని ఆ సంస్థ అధికార ప్రతినిధి జో ఎవాంజెలిస్టి వెల్లడించారు. ఈ అంతరాయం వెనుక ఎలాంటి సైబర్ దాడి లేదా హ్యాకర్ల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. కస్టమర్ల ఖాతాలు, నిధులు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని బ్యాంకు హామీ ఇచ్చింది. బ్యాంకింగ్ సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి మా సిబ్బంది కృషి చేస్తోందని తెలిపారు. 

వినియోగదారులకు జాగ్రత్తలు

సేవలు సాధారణంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకోకముందే పదే పదే ట్రాన్సాక్షన్లు చేయకపోవడం మంచిదని సూచించారు. అనుకోకుండా డబుల్ పేమెంట్లు జరగకుండా ఉండాలంటే ట్రాన్సాక్షన్ హిస్టరీ చెక్ చేసుకోవాలని చెప్పారు. బ్యాంకు సేవల పునరుద్ధరణకు సంబంధించిన సమాచారం కోసం బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్లు, యాప్‌లు లేదా వెరిఫైడ్ కస్టమర్ కేర్ నంబర్లనే నమ్మాలన్నారు. అవుటేజ్ సమయంలో పాస్‌వర్డ్లు, పిన్‌లు, OTPలు అడిగే అనుమానాస్పద మెసేజ్‌లు, లింక్‌లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బ్యాంక్ ప్రతినిధులమని చెప్పే అపరిచితులకు ఏ సమాచారమూ అందజేయకూడదని సూచించారు. 

మైక్రోసాఫ్ట్ డౌన్‎తో అల్లకల్లోలం

సాఫ్ట్‌‌‌‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు ఇమెయిళ్లు, టీమ్స్ చాట్‌‌‌‌లు, మీటింగ్‌‌‌‌ తదితర సేవలు నిలిచిపోయాయి. ఈ అంతరాయం ఆసియా నుంచి అమెరికా వరకు అన్ని రంగాలను అస్తవ్యస్తం చేసింది. ఏకంగా 74 దేశాలకు విస్తరించిన ఈ సాంకేతిక సమస్య కారణంగా మిలియన్ల కొద్దీ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

దాదాపు 20 గంటల పాటు కొనసాగిన ఈ అంతరాయం పలు వ్యాపారాలు, ప్రభుత్వ సంస్థలు, ఆరోగ్య సంరక్షణ సేవలు, పాఠశాలలు, చివరికి మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను కూడా ప్రభావితం చేసింది. గురువారం సాయంత్రం 6 గంటల (జీఎంటీ) ప్రాంతంలో ఈ అంతరాయం మొదలైంది. సేవా అంతరాయాలను ట్రాక్ చేసే 'డౌన్ డిటెక్టర్' వెబ్‌‌‌‌సైట్, మైక్రోసాఫ్ట్ 365 గురించిన ఫిర్యాదులలో ఒక్కసారిగా తీవ్ర పెరుగుదలను నమోదు చేసింది. 

అయితే, ఈ అంతరాయానికి ఎలాంటి సైబర్ దాడి కారణం కాదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. సేవలను పూర్తిగా సాధారణ స్థితికి తీసుకురావడానికి మైక్రోసాఫ్ట్ ఇంజనీర్లు యుద్ధప్రాతిపదికన చర్యలు కొనసాగిస్తున్నారని వివరించింది. కాగా, 2024 నాటి ‘క్రౌడ్‌‌‌‌స్ట్రైక్’ ఉదంతాన్ని తలపించే ఈ ఘటన.. డిజిటల్ యుగంలో టెక్నాలజీపై అతిగా  ఆధారపడటాన్ని మరోసారి ప్రశ్నార్థకం చేసింది.

ఏంజరిగిందంటే..

మైక్రోసాఫ్ట్ 365 ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లోని ఎక్స్ఛేంజ్ ఆన్‌‌‌‌లైన్ సేవల్లో ఈ సాంకేతిక సమస్య తలెత్తింది. ముఖ్యంగా ఔట్​లుక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, ఏఐ అసిస్టెంట్ ‘కోపైలట్’ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. సర్వర్లలో సురక్షిత కనెక్షన్లను ఏర్పాటు చేసే ప్రాసెస్ ఓవర్‌‌‌‌హెడ్ కావడంతో ఈ సమస్య తలెత్తిందని కంపెనీ తెలిపింది. అకస్మాత్తుగా పెరిగిన లోడ్ కారణంగా సర్వర్లు రిక్వెస్ట్‌‌‌‌లను ప్రాసెస్ చేయలేకపోయాయి. అయితే, దీని వెనుక ఎలాంటి సైబర్ దాడి లేదా హానికరమైన ఉద్దేశాలు లేవని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. 36 గంటల అనంతరం మైక్రోసాఫ్ట్ సమస్యను పరిష్కరించింది. 

ఇదిలా ఉండగానే.. అమెరికా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడం గమనార్హం. దీని కంటే ముందు అమెరికా విమానాయాన రంగంలో సంక్షోభం ఏర్పడింది. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్(ఏటీసీ) వ్యవస్థలో తలెత్తిన టెక్నికల్ లోపంతో సుమారు 8 వేలకు పైగా విమానాలు ఎయిర్ పోర్టుల్లోనే నిలిచిపోయాయి. అంతేగాక, వేలాది విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీంతో 15 లక్షల మందికి పైగా ప్యాసింజర్లు తమ ఫ్లైట్ల కోసం సుమారు 4 గంటల పాటు ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుల్లోనే పడిగాపులు కాశారు. 2001లో జరిగిన 9/11 ఉగ్రదాడుల తర్వాత అమెరికాలో ఇలా దేశవ్యాప్తంగా విమానాలను ఆపేయడం ఇది రెండోసారి. దిగ్గజ టెక్ కంపెనీలకు నిలయమైన అగ్రరాజ్యంలో వరుసగా చోటు చేసుకుంటున్న సాంకేతిక సమస్యలు చర్చనీయాంశంగా మారాయి.