ఒకప్పుడు టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా శ్రీలీల పేరే వినిపించేది. స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు.. అదిరిపోయే డ్యాన్స్‌తో కుర్రాళ్లలో విపరీతమైన క్రేజ్.. తక్కువ సమయంలోనే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. తెలుగులో కొత్త సినిమాల అనౌన్స్ కనిపించడం లేదు. చేసిన సినిమాలు కూడా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోతున్నాయి. మరోవైపు తమిళం, హిందీ సినిమాలతో ఈ బ్యూటీ బిజీగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే అసలు శ్రీలీలకు టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయా? వరుస పరాజయాలే అందుకు కారణమా? లేక తన సినిమా ఎంపిక విషయంలో ఆమెనే రూటు మార్చుకుందా? అనే విషయాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ధనుష్ ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.
వరుస సినిమాలతో టాలీవుడ్‌లో సెన్సేషన్..
కన్నడ చిత్రం ‘కిస్’తో నటిగా కెరీర్ ప్రారంభించిన శ్రీలీల.. ‘పెళ్లి సందD’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా తర్వాత రవితేజ సరసన చేసిన ‘ధమాకా’ బ్లాక్‌బస్టర్ కావడంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకుంది. దీంతో టాలీవుడ్‌లో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’, రామ్‌తో ‘స్కంద’, వైష్ణవ్ తేజ్‌తో ‘ఆదికేశవ’, నితిన్‌తో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ వంటి సినిమాల్లో నటించింది. ఇక మహేష్ బాబు సరసన ‘గుంటూరు కారం’ సినిమాలో నటించి స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. ఈ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ పాటలో ఆమె డ్యాన్స్‌కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఇన్ని అవకాశాలు వచ్చినా.. ప్రతి సినిమా ఆమె కెరీర్‌కు విజయాన్ని అందించలేకపోయింది.
ఆ తప్పులు మళ్లీ చేయనంటున్న శ్రీలీల..
ధనుష్ నటించిన ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. “నా సినీ ప్రయాణం గురించి మీకు తెలిసిందే. చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. అప్పట్లో ఏ సినిమాలో అవకాశం వచ్చినా అంగీకరిస్తూ ముందుకు సాగాను. సినిమాలను ఎంచుకునే స్థాయిలో నేను లేను. అలా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ వెళ్లిపోయాను. అయినప్పటికీ ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమ చూపించారు. అంతకంటే ఆనందం ఇంకేం ఉంటుంది? ఆ తర్వాత నా సినిమా ప్రయాణం గురించి ఆలోచించుకున్నాను. నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఆ సమయంలో దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామిని కలిశాను. ‘నీకు నచ్చినది ఎంచుకుని, సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడే నీ జీవితంలో మార్పు వస్తుంది’ అని ఆయన చెప్పారు” అంటూ శ్రీలీల తన సినీ ప్రయాణం గురించి చెప్పుకొచ్చింది. ముంబైలో మెడిసిన్ ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడే ఈ సినిమా కథ విన్నానని వెల్లడించింది. అంతేకాదు, ఇందులో తన పాత్రకు పాటలు, డ్యాన్స్‌లు ఉండవని ముందే చెప్పినా అంగీకరించానని తెలిపింది. కమర్షియల్ హీరోయిన్ ఇమేజ్‌కు భిన్నంగా కొత్త పాత్రలో కనిపించాలనే ఉద్దేశంతోనే ‘ఓం’ను ఎంచుకున్నట్లు చెప్పుకొచ్చింది.
సాయి పల్లవితో నటించడం ప్రత్యేకమన్న శ్రీలీల..
‘ఓం’ సినిమాలో సాయి పల్లవితో కలిసి నటించడం తనకు ఎంతో ప్రత్యేకమని శ్రీలీల చెప్పింది. తాను మెడిసిన్ ఎంట్రన్స్ పరీక్ష రాస్తున్న సమయంలో విడుదలైన ‘ఫిదా’ సినిమా తమ కుటుంబానికి స్ఫూర్తినిచ్చిందని గుర్తుచేసుకుంది. ఇప్పుడు డాక్టర్ డిగ్రీ పూర్తి చేసి సాయి పల్లవితో కలిసి నటించడం ఆనందంగా ఉందని తెలిపింది. ఈ సినిమాలో సాయి పల్లవి నిత్యారెడ్డి అనే తెలుగు అమ్మాయిగా, తాను తమిళ యువతిగా కనిపించనుంది. ఇక ఈవెంట్‌లో ఇద్దరూ కలిసి స్టేజ్‌పై చేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరి పెర్ఫార్మెన్స్‌కు ధనుష్ సైతం చప్పట్లతో అభినందించారు.
►ALSO READ | మనిషి కాదు మహా శత్రువు.. ఏలియన్‌తో అక్షయ్ కుమార్ భీకర పోరాటం!
ప్రస్తుతం తమిళం, హిందీ సినిమాలపై ఫోకస్..
తెలుగులో కొత్త సినిమాలు ప్రకటించని శ్రీలీల.. ప్రస్తుతం తమిళం, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి నటించిన ‘ఓం’లో రోజా పాత్రలో కనిపించనుంది. మరోవైపు రజనీకాంత్ సినిమా ‘ధర్మన్’, అజిత్ నటిస్తున్న ‘డేర్ డెవిల్’ ప్రాజెక్టులతో పాటు కార్తీక్ ఆర్యన్ సరసన ఓ హిందీ సినిమాలోనూ నటిస్తోంది. ఇలా ఇతర భాషల్లో అవకాశాలు అందుకుంటున్న శ్రీలీల.. టాలీవుడ్‌లో మాత్రం కొత్త ప్రాజెక్ట్ ప్రకటించకపోవడం ఆసక్తికరంగా మారింది.
మళ్లీ టాలీవుడ్‌లో పుంజుకుంటుందా?
ఒకప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్‌ను ఊపేసిన శ్రీలీల.. ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. వరుస పరాజయాల తర్వాత కథల ఎంపికలో జాగ్రత్త పడుతుందా? ఇతర భాషల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరి మంచి కథతో శ్రీలీల మళ్లీ తెలుగులో బ్లాక్‌బస్టర్ అందుకుంటుందేమో చూడాలి!
