సన్‌రైజర్స్‌కు మైండ్ బ్లాకింగ్ షాక్.. ఐపీఎల్ 2027కు ట్రావిస్ హెడ్ గుడ్‌బై..? 

సన్‌రైజర్స్‌కు మైండ్ బ్లాకింగ్ షాక్.. ఐపీఎల్ 2027కు ట్రావిస్ హెడ్ గుడ్‌బై..? 

Travis Head- IPL 2027 : ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad - SRH) అభిమానులకు ఊహించని పిడుగులాంటి వార్త అందింది. ప్రత్యర్థి బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేసిన సన్‌రైజర్స్ విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) రాబోయే ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ అనూహ్య పరిణామం ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ లైనప్‌కు కోలుకోలేని దెబ్బగా మారింది.

వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగానే తప్పుకున్న హెడ్: 

ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ క్రిక్‌ఇన్ఫో (ESPNcricinfo) నివేదిక ప్రకారం, ట్రావిస్ హెడ్ ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్‌కు తన నిర్ణయాన్ని అధికారికంగా తెలియజేశాడని.. ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరఫున ఉన్న బిజీ అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ దృష్ట్యా, తన పని భారాన్ని (Workload Management) తగ్గించుకోవడానికి ఐపీఎల్ 2027కు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు ట్రావిస్ హెడ్ స్పష్టం చేశాడు.

ముగిసిన ట్రావిషేక్ విధ్వంసకర ప్రస్థానం: 

కాగా, గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీగా పేరుగాంచిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ('Travishek') పార్ట్‌నర్‌షిప్‌కు ఇప్పుడు బ్రేక్ పడింది. పవర్‌ప్లేలోనే బౌలర్లపై విరుచుకుపడుతూ రికార్డుల మోత మోగించిన ఈ జోడీ ఇకపై ఐపీఎల్ 2027లో కలిసి ఆడటం కనిపించదు. అభిషేక్ శర్మకు సరైన జోడీ లేకపోవడం సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ఆరంభంపై పెద్ద ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. 

కొత్త ఓపెనర్ వేటలో సన్‌రైజర్స్:

కెప్టెన్ ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ లాంటి హేమాహేమీలతో కూడిన సన్‌రైజర్స్ కోర్ టీమ్‌లో ట్రావిస్ హెడ్ అత్యంత కీలకమైన ఆటగాడు. ఇప్పుడు అతడు అందుబాటులో లేకపోవడంతో SRH యాజమాన్యం తమ జట్టు కూర్పుపై మళ్లీ కసరత్తు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రిటెన్షన్ గడువు ముగుస్తున్న వేళ హెడ్ తీసుకున్న ఈ నిర్ణయంతో, రాబోయే మినీ వేలంలో అతడి స్థానాన్ని భర్తీ చేయగల విధ్వంసకర ఓపెనర్ కోసం సన్‌రైజర్స్ గట్టిగానే ప్రయత్నించాల్సి ఉంది.