రానున్న మూడేళ్లలో మరో 2 లక్షల ఇండ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి వివేక్

రానున్న మూడేళ్లలో మరో 2 లక్షల ఇండ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి వివేక్

మంచిర్యాల: పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఆర్థికంగా ఇతరులపై ఆధారపడకుండా ఆత్మగౌరవంతో జీవించేందుకు ప్రభుత్వం చేయూత పెన్షన్లు అందిస్తోందని రాష్ట్ర కార్మిక, గనుల, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం (నవంబర్ 17) మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గద్దెరాగడిలోని ఎన్‌వీఆర్ గార్డెన్‌లో క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీలతో పాటు మందమర్రి మండలానికి చెందిన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన ప్రజల సమస్యలకు ప్రజాపాలన ప్రభుత్వం పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు, పెన్షన్ కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. ప్రస్తుతం పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని, ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు గృహజ్యోతి పథకం ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని, పార్టీలు చూడకుండా పేదరికాన్ని ప్రాతిపదికగా తీసుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో లేకపోయినా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నామని, దీపావళి నాటికి రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. రానున్న మూడేళ్లలో మరో రెండు లక్షల ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.

చెన్నూరు నియోజకవర్గంలో రూ.800 కోట్లతో అభివృద్ధి పనులు

చెన్నూరు నియోజకవర్గంలో సుమారు రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. రూ.100 కోట్లతో అమృత్ పథకం ద్వారా తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు.

అలాగే రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, చెన్నూరు ప్రాంతంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. 100 పడకల ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉందని, మందమర్రిలో 50 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నట్లు తెలిపారు.

మందమర్రి ఏజెన్సీ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఆరు ఎకరాల భూమిని కేటాయించి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు.

ఆర్‌కే ఓసీలో కొత్త బొగ్గు గని ఏర్పాటు

కొత్త గనుల వేలంలో గత ప్రభుత్వం పాల్గొనకపోవడంతో ఈ ప్రాంతానికి కొత్త గనులు రాలేదని మంత్రి అన్నారు. త్వరలో ఆర్‌కే ఓసీలో కొత్త బొగ్గు గని ఏర్పాటు కానుందని, దీనివల్ల స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

గోదావరి పుష్కరాల కోసం రూ.70 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బొక్కలగుట్ట, అందుగులపేట, సండ్రుల్‌పల్లె, పులిమడుగు గ్రామాలకు కల్వర్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. చెన్నూరు నియోజకవర్గంలో రూ.80 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలి

రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. తాగునీరు, సాగునీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం విద్యుత్ వినియోగం 33 శాతం అధికంగా ఉందని తెలిపారు.

కరోనా సమయంలో ఎదుర్కొన్న సవాళ్ల మాదిరిగానే ఎల్‌నినో కారణంగా తలెత్తే కరువు పరిస్థితులను కూడా సమష్టిగా ఎదుర్కోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు.