వెండి ధర కుప్పకూలింది : జనవరిలో 4 లక్షలు.. ఇప్పుడు లక్షా 90 వేలు మాత్రమే..!

వెండి ధర కుప్పకూలింది : జనవరిలో 4 లక్షలు.. ఇప్పుడు లక్షా 90 వేలు మాత్రమే..!

నిన్నా మొన్నటికి వరకు వెండి బంగారమాయే అన్నట్లు చెప్పుకున్నాం.. వెండి ధరలు రికార్డులు బద్దలు చేస్తూ దూసుకెళ్లింది. కిలో వెండి 4 లక్షల రూపాయలు దాటింది. అది ఎప్పుడో తెలుసా.. 2026 జనవరి నెలలో.. అంటే 10 నెలల క్రితం.. మరి ఇప్పుడు వెండి కిలో ఎంతో తెలుసా.. రిటైల్ మార్కెట్ లో.. అదేనండీ మన దగ్గర ఉన్న షాపుల్లో.. కిలో వెండి లక్షా 90 వేల రూపాయలు. అవును.. 2026, నవంబర్ 17వ తేదీన కిలో వెండి రెండు లక్షల రూపాయలలోపునకు పడిపోయింది. షాపుల్లో కిలో వెండి లక్షా 90 వేల రూపాయలుగా ఉండగా.. ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో కిలో వెండి లక్షా 75 వేల రూపాయలుగానే ఉంది. అంటే వెండిపై పెట్టుబడి పెట్టే MCX మార్కెట్ అన్నమాట.. అంటే జనవరి నెలలో 4 లక్షల రూపాయలుగా ఉన్న కిలో వెండి.. ఇప్పుడు లక్షా 90 వేల రూపాయలకు పడిపోయింది.. వెండి ధర ఇంత పడిపోవటానికి కారణం ఏంటీ.. ఎందుకు వెండి ధర కుప్పకూలుతుంది అనేది తెలుసుకుందాం...

వెండి ధర పతనం వెనక లాభాలా స్వీకరణ. ఫ్యూచర్స్ మార్కెట్ లో మొన్నటి వరకు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు ఇన్వెస్టర్లు. వెండి ధర పెరిగిన తర్వాత.. లాభాల స్వీకరణ మొదలుపెట్టారు. అధిక ధరలో వెండిని తెగనమ్ముతున్నారు పెట్టుబడిదారులు. ఈ క్రమంలోనే వెండి ధర రోజురోజుకు పతనం అవుతుంది. 

మరో కారణం ఏంటంటే.. 2025 నుంచి ఊహించని విధంగా పెరుగుతూ వచ్చిన వెండి ధరల్లో.. కరెక్షన్ వచ్చింది. మొన్నటి వరకు అధిక పెట్టుబడుల వల్ల పెరిగిన వెండి ధర.. ఇప్పుడు వాస్తవ ధరకు దగ్గరకు వస్తుంది. డిమాండ్, సప్లయ్ ఆధారంగా ధరను సెట్ చేస్తున్నారు వ్యాపారులు. ఈ క్రమంలోనే  వెండి ధర పడిపోయింది. 

ప్రపంచ వ్యాప్తంగా 2027లో వెండి అంచనా వేసిన డిమాండ్ ను.. ఐదు శాతానికి తగ్గించారు. అంటే అంచనాల కంటే వెండి డిమాండ్ తక్కువగా ఉండటంతో.. రోజు రోజుకు ధర తగ్గిపోయింది. ఇదే సమయంలో అమెరికా డాలర్ విలువ పెరగటం.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచుతుందన్న వార్తలు, పరిశ్రమల్లో వెండి వినియోగం స్థిరంగా ఉండటంతోపాటు.. రాబోయే రోజుల్లో 5 శాతం మేర కొనుగోళ్లను తగ్గిస్తారనే అంచనాలతో.. వెండి ధరలు పడిపోతున్నాయి. 

ఇండస్ట్రీయల్ సెక్టార్స్ అయిన  సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వినియోగం 3 శాతం తగ్గింది. EV వెహికల్స్, సోలార్ ప్యానెల్స్ మార్కెట్ ఆశించిన స్థాయిలో లేకపోవటంతో..  ఆయా రంగాల్లో వెండి వినియోగం గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలోనే డిమాండ్ తగ్గిపోయింది. ధర పడిపోయింది. 

ప్రపంచ వ్యాప్తంగా వెండి మార్కెట్ ను పరిశీలిస్తే.. ధర పెరగటంతో సాధారణ కొనుగోళ్లు (జనం) ఐదు శాతం తగ్గాయి.. ఇదే క్రమంలోనే ఇండస్ట్రీయల్ వినియోగం 3 శాతం తగ్గింది. ఓవరాల్ గా వెండి డిమాండ్ 8 శాతం పడిపోయింది. రాబోయే ఏడాది అంటే 2027లోనూ వెండి డిమాండ్ అంచనాలకు మించి 5 శాతం తగ్గొచ్చన్న మార్కెట్ వర్గాల వార్తలతో.. వెండి ధర కుప్పకూలింది. 

ALSO READ : బంగారానికి ఏమైందీ.. వారం రోజుల్లో రూ.10 వేలు తగ్గింది

2026 జనవరి నెలలో కిలో వెండి 4 లక్షల రూపాయలుగా ఉండగా.. నవంబర్ 17వ తేదీ నాటికి కిలో వెండి లక్షా 90 వేలు ( రిటైల్ మార్కెట్) పడిపోవటం మామూలు విషయం కాదు. 4 లక్షల రూపాయల్లో వెండిని కొనుగోలు చేసిన వారు.. ఇప్పుడు లబోదిబో అంటున్నారు. వెండి పతనం ఇలాగే కొనసాగితే.. కిలో వెండి లక్ష రూపాయలకు వచ్చినా ఆశ్చర్యం లేదని కొందరు వ్యాపారులు అంటున్నారు.