బంధువులను, ఫ్రెండ్స్ ను సాగనంపేందుకు రైల్వే స్టేషన్ వెళ్తుంటాం.. రైలు ఎక్కి సామాను సర్ది.. హ్యాపీ జర్నీ చెప్పి.. రైలు కదుతుండగా కిందికి దిగుతుంటాం. ఇది మామూలు సూపర్ ఫాస్ట్, ప్యాసెంజర్ రైళ్లలో కామన్. అదే వందేభారత్ రైల్లో అయితే అలా చేయగలమా. ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ సిస్టమ్ ఉంటుంది. కాసేపు ఆలస్యమైతే రైల్లోనే చిక్కుకుపోయే పరిస్థితి. కాన్పూర్ లో వందేభారత్ ఎక్కిన 12 మందికి స్వయంగా ఈ అనుభవం ఎదురైంది. తర్వాతి స్టేషన్ లో దిగి ఏకంగా 36 వేల రూపాయల ఫైన్ కట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ స్టేషన్లో ఉదయం 9:26కి వందేభారత్ ట్రెయిన్ వచ్చింది. 9:30కి బయలుదేరాల్సిన ట్రెయిన్లో బంధువు సామాను పెట్టడంలో సాయం చేసేందుకు ఆ 12 మంది లోపలికి వెళ్లారు. కాసేపు ముచ్చట్లు పెట్టే లోపే టైమ్ అయ్యింది. ట్రెయిన్ కదిలిపోయింది. వందేభారత్‌లో ఆటోమేటిక్ తలుపులు ఉండడంతో, ట్రెయిన్ బయలుదేరిన తర్వాత తలుపులు మూసుకుపోయాయి. దీంతో వారు బయటకు రాలేకపోయారు.
►ALSO READ | మళ్లీ కాంగ్రెస్‌లోకి మాజీ సీఎం..? అమరీందర్ సింగ్ రీఎంట్రీపై జోరుగా చర్చ
అయితే తాము దిగాలి.. ట్రైన్ ఆపాలని లోపల గొడవ చేస్తూ తలుపులు తెరవాలని డిమాండ్ చేశారు. కానీ ట్రెయిన్ అప్పటికే వేగం పుంజుకుంది. ట్రైన్ లో నానా రభస చేసే సరికి వందేభారత్ సాధారణంగా ఆగని ఇటావా స్టేషన్లో ఉదయం 10:49కి ట్రెయిన్‌ను నిలిపి, 12 మందినీ దింపారు.
రైల్వే పోలీసు విచారించగా, వారు ప్లాట్‌ఫాం టికెట్ కూడా తీసుకోకుండా స్టేషన్లోకి వచ్చినట్టు తేలింది. టికెట్ లేకుండా స్టేషన్లోకి రావడం, వందేభారత్‌లో ప్రయాణించడం, రెండు నేరాల కింద ఒక్కొక్కరికి రూ.3,000 చొప్పున మొత్తం రూ.36,000 జరిమానా విధించారు. 12 మంది జరిమానా చెల్లించిన తర్వాత పోలీసులు వారిని విడిచిపెట్టారు. ఇలాంటి తప్పు మళ్లీ చేయొద్దని హెచ్చరించారు.
