టాలీవుడ్ లో 'తకిట తకిట','అవును', 'ప్రేమ ఇష్క్ కాదల్' వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు హర్షవర్ధన్ రాణే. అంతే కాదు బాలీవుడ్‌లో 'సనమ్ తేరీ కసమ్' చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సినిమా మొదట విడుదలైనప్పుడు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా, గతేడాది థియేటర్లలో రీ-రిలీజ్ అయినప్పుడు మాత్రం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా యువతలో ఈ సినిమాకు విపరీతమైన ఆదరణ లభించింది.
అయితే హర్షవర్ధన్ రాణేకు బాలీవుడ్ నిర్మాత దీపక్ ముకుట్ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా లగ్జరీ ల్యాండ్ రోవర్ కారును బహుమతిగా అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 'సనమ్ తేరీ కసమ్' రీ-రిలీజ్ సమయంలోనే నిర్మాత దీపక్ ముకుట్ హర్షవర్ధన్‌కు ఓ ఖరీదైన బహుమతి ఇస్తానని మాటిచ్చారట. అన్నట్టుగానే లేటెస్ట్ గా తన హామీని నిలబెట్టుకున్నారు. హర్షవర్ధన్‌కు ఏకంగా రూ.3.5 కోట్లకు పైగా విలువైన 'ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా' కారును బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా కారు తాళాలు అందిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.
►ALSO READ | రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' మ్యూజిక్‌కు గ్రామీ షాక్.. 9 విభాగాల్లో పంపినా దక్కని చోటు!
నిర్మాత పోస్టును రీషేర్ చేసిన హర్షవర్ధన్.. దీపక్ ముకుట్‌పై ప్రశంసలు కురిపించారు. జీవితంలో ఎన్నో హామీలు విన్నానని, కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వ్యక్తులు చాలా అరుదని పేర్కొన్నారు. దీపక్ అలాంటి అరుదైన వ్యక్తి అంటూ కొనియాడారు. అంతేకాదు, ఈ ఆనందంలో మరో ఆసక్తికరమైన కోరికను కూడా బయటపెట్టారు. 'సనమ్ తేరీ కసమ్ 2' సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్మాతను కోరారు. మొత్తానికి హర్షవర్ధన్ రాణేకు దక్కిన ఈ సర్‌ప్రైజ్ బాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
