Casting Couch: అప్పుడూ, ఇప్పుడూ ఎప్పటికీ ఉంటుంది.. క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్

Casting Couch: అప్పుడూ, ఇప్పుడూ ఎప్పటికీ ఉంటుంది.. క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా? లేదా? అనే చర్చ చాలాకాలంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఎంతోమంది నటీనటులు ఈ అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా సీనియర్ నటి రమ్యకృష్ణ (Ramya Krishnan)  కూడా ఈ వివాదాస్పద అంశంపై స్పందించారు. ప్రముఖ తెలుగు యూట్యూబ్ పాడ్‌కాస్ట్ ‘రా టాక్స్ విత్ వీకే’ (Raw Talks With VK)లో పాల్గొన్న ఆమె.. క్యాస్టింగ్ కౌచ్ ఉనికిని ఎవరూ కాదనలేరని స్పష్టం చేశారు.

క్యాస్టింగ్ కౌచ్ ఎప్పటికీ ఉంటుంది: రమ్యకృష్ణ

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఇప్పటికీ ఉందా? అనే ప్రశ్నకు రమ్యకృష్ణ ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా అమెరికాలో వెలుగులోకి వచ్చిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను (Epstein Files) ప్రస్తావించారు. మహిళలకు ఎంతో స్వేచ్ఛ ఉందని భావించే దేశాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. అలాంటప్పుడు మన దగ్గర ఇలాంటివి జరగవని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు.గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, ప్రస్తుతం కూడా జరుగుతున్నాయని, భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. అయితే కాలానుగుణంగా ఈ  క్యాస్టింగ్ కౌచ్‌ జరిగే విధానంలో మార్పులు రావచ్చని అభిప్రాయపడ్డారు. బలవంతంగా కావచ్చు, ఇష్టపూర్వకంగా కావచ్చు లేదా సాధారణ పరిచయాల ముసుగులో కావచ్చు.. ఏ రూపంలోనైనా క్యాస్టింగ్ కౌచ్‌ జరిగే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరని రమ్యకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఆడ, మగ అనే తేడా లేదు.. అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి!

క్యాస్టింగ్ కౌచ్ అనగానే కేవలం మహిళా నటీమణులకే ఎదురయ్యే సమస్యగా చూడటం సరైంది కాదని రమ్యకృష్ణ అభిప్రాయపడ్డారు. సినిమా రంగంలో గ్లామర్ కారణంగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా వార్తల్లోకి వస్తాయని, వాస్తవానికి అన్ని రంగాల్లోనూ లైంగిక దోపిడీ జరుగుతోందని పేర్కొన్నారు. అయితే, సినిమా రంగం బయట కూడా ఎంతోమంది మహిళలు ఇలాంటి వేధింపులను ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. అంతేకాదు.. క్యాస్టింగ్ కౌచ్ కి ఆడ, మగ అనే తేడా లేకుండా ఎవరైనా బాధితులయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ లేటెస్ట్ కామెంట్స్ క్యాస్టింగ్ కౌచ్‌పై జరుగుతున్న చర్చకు మరోసారి తెరలేపారు.

►ALSO READ | ‘వారణాసి’ ఏపీ, తెలంగాణ రైట్స్ సొంతం చేసుకున్న మైత్రీ.. ఎన్ని వందల కోట్లంటే?

గతంలో సెట్స్‌లో కనీస సౌకర్యాలు కూడా లేవు!

తన కెరీర్ ప్రారంభ రోజుల్లో సినిమా సెట్స్‌లో మహిళా నటీమణులకు వాష్‌రూమ్స్, క్యారవాన్స్, దుస్తులు మార్చుకునే గదులు వంటి కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కావని రమ్యకృష్ణ గుర్తుచేసుకున్నారు. కొన్నిసార్లు అంబాసిడర్ కార్లలోనే బాటిళ్లను ఉపయోగించుకోవాల్సి వచ్చేదని తెలిపారు. అప్పటితో పోలిస్తే ఇప్పటి నటీనటులు ఎంతో అదృష్టవంతులని, తాము ఎదుర్కొన్న కష్టాల్లో కనీసం నాలుగో వంతు కూడా వారు అనుభవించడం లేదని పేర్కొన్నారు.

కృష్ణవంశీతో విడాకుల వార్తలపై క్లారిటీ!

ఇదే పాడ్‌కాస్ట్‌లో తన వైవాహిక జీవితంపై వస్తున్న పుకార్లకు కూడా రమ్యకృష్ణ చెక్ పెట్టారు. దర్శకుడు కృష్ణవంశీతో విడిపోయారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తామిద్దరం ఇంకా భార్యాభర్తలుగానే ఉన్నామని, వృత్తిపరమైన కారణాలతోనే వేర్వేరు నగరాల్లో నివసిస్తున్నామని వెల్లడించారు. తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవని, ఇద్దరూ సంతోషంగానే ఉన్నామని ఆమె చెప్పుకొచ్చారు.

'జైలర్ 2'తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు..

ఇక సినిమాల విషయానికొస్తే.. రమ్యకృష్ణ ఇటీవల రజనీకాంత్ నటించిన 'జైలర్ 2'లో కనిపించారు. ప్రస్తుతం 'రాకా', 'శ్రీ శ్రీ', 'పాకెట్ నవల్', 'తేరా యార్ హూన్ మే' వంటి పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. వరుస సినిమాలతో అలరిస్తూనే, మరోవైపు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.