బ్రేకప్ చెప్పిందన్న కోపంతో ప్రియురాలు అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్కలను ఆమె ప్రియుడు దారుణంగా కొట్టి చంపిన ఘటన వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. కుక్కలను చంపేటప్పుడు ప్రియురాలికి వీడియో కాల్ చేసి లైవ్ చూపించాడా సైకో. తాజాగా తెలంగాణలో కూడా ఇలాంటి తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లా రంగశాయిపేటలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. పెంపుడు కక్కును చంపి ఆ తర్వాత భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సంజీవ్, శోభ భార్యాభర్తలు. కారణమేంటో తెలియదు గానీ మంగళవారం (నవంబర్ 17) దంపతులిద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సూసైడ్‌కు ముందు తమ పెంపుడు కుక్కను చంపారు. ఆ తర్వాత భార్యాభర్తలు సూసైడ్ చేసుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంజీవ్, శోభ మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక, కుటుంబ సమస్యలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మహత్యలకు మరేదైనా కారణం ఉందా కోణంలో ఆరా తీస్తున్నారు. భార్యాభర్తల మృతితో రంగశాయిపేటలో విషాదచాయలు అలుముకున్నాయి.
