సంక్షేమాన్ని అడ్డుకునే రాజకీయాలను తిప్పి కొట్టాలి : ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్

సంక్షేమాన్ని అడ్డుకునే రాజకీయాలను తిప్పి కొట్టాలి :  ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్

తొర్రూరు, వెలుగు : పేదలకు ఇండ్లు పంపిణీ చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులకు కడుపు మండుతుందని, ప్రజా సంక్షేమాన్ని అడ్డుకునే రాజకీయాలను తిప్పికొట్టాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని దుబ్బతండా సమీపంలో నిర్మించిన 280 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్​లో ఆయన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కలెక్టర్ స్నేహ శబరీష్ తో కలిసి లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. 

అనంతరం రామచంద్రునాయక్​ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం వచ్చాక అందరికీ ఇండ్లు అందుతున్నాయని, పేదలకు ఇళ్లు ఇస్తుంటే ప్రతిపక్షాలు తట్టుకోలేక విషం చిమ్ముతున్నాయని విమర్శించారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలకు భూమిని విరాళంగా అందించిన దుబ్బతండాకు చెందిన రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ భూక్య బాబును ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా హౌజింగ్ పీడీ పురుషోత్తం, మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.