హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు, హోర్డింగ్ లను కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారని టీపీసీసీ అధికార ప్రతినిధి బోయ నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీకి చెందిన వ్యక్తులుగా భావిస్తున్న కొందరు ఈ చర్యలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు సోమవారం సిటీ సౌత్ జోన్ డీసీపీకి వినతిపత్రం అందించారు. రాహుల్ హైదరాబాద్ పర్యటన పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వాటిని చించివేశారని, ఈ ఘటనలతో అనవసర ఉద్రిక్తతలు, రాజకీయ ఘర్షణలకు ఆస్కారం ఏర్పడుతోందన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీల కార్యక్రమాలకు సంబంధించిన ప్రచార సామగ్రిని ధ్వంసం చేయడం సరికాదన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
