హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి 400 మందికి పైగా పౌర సమాజ నేతలు, మేధావుల బహిరంగ లేఖ రాశారు. తీవ్రమైన ఎల్-నినో కరువు నేపథ్యంలో 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్'ను తక్షణమే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 31 జిల్లాల్లోని 365 మండలాల్లో కరువు ఉన్నప్పుడు విదేశీ సదస్సులు అవసరమా అంటూ నిలదీశారు.
జనం దాహంతో అల్లాడుతుంటే 4 వేల మంది అతిథులకు ఫైవ్-స్టార్ విలాసాలా అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి ఎద్దడితో స్కూళ్లు, హాస్టళ్లు మూతపడుతుంటే భారత్ ఫ్యూచర్ సిటీలో వేడుకలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. కరువు సహాయక చర్యలను గాలికొదిలేసి ఉన్నతాధికారులను అతిథుల సేవలకు మళ్లించడంపై మండిపడ్డారు.
విదేశీ ప్రతినిధులకు ఐఏఎస్, ఉన్నతాధికారులను లైజన్ ఆఫీసర్లుగా నియమించడం పరిపాలనా వైఫల్యమేనని విమర్శించారు. ప్రజాధనం, నీరు, విద్యుత్‌ను పూర్తిగా కరువు నివారణకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రథమ కర్తవ్యమని సీఎంకు తెలంగాణ పీపుల్స్ కోయలిషన్ విజ్ఞప్తి చేసింది. ప్రొఫెసర్ శాంతా సిన్హా, ఆకునూరి మురళి, ఇ.ఎ.ఎస్. శర్మ తదితర ప్రముఖులు ఈ లేఖపై సంతకాలు చేశారు
