ఈనాడు పత్రిక అధినేత, పద్మభూషణ్ రామోజీరావు జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ.. ప్రతి ఏటా జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు. రామోజీరావు జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డుల కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారాయన. దీనికి సంబంధించి జీవో జారీ చేయటం జరిగిందని వివరించారు సీఎం చంద్రబాబు. ప్రతి ఏడాది రామోజీ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.
జర్నలిజం, కళలు, సంస్కృతి, గ్రామీణాభివృద్ధి-, వ్యవసాయం, మహిళా సాధికారిత, సైన్స్ & టెక్నాలజీ, యూత్ ఐకాన్, సామాజిక సేవ, విద్య, వైద్య రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి.. ఇక నుంచి ప్రతి సంవత్సరం రామోజీరావు జయంతి రోజున అవార్డులు అందించటం జరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు. నిష్పక్షపాతంగా ఆయన జర్నలిజం సహా వివిధ రంగాల్లో సేవలందించారని కొనియాడారు.
కృష్ణా జిల్లాలో జన్మించిన రామోజీరావు గొప్ప సంస్థలను స్థాపించారని.. సమర్ధంగా వాటిని నడిపించారని.. సంకల్పం-, క్రమశిక్షణ, విలువలు, సమాజహితం, నాణ్యత, విశ్వసనీయత లాంటివి ఆయన తెచ్చిన విధానాలుగా రామోజీరావును కీర్తించారు సీఎం చంద్రబాబు. జనం కోసం జర్నలిజాన్ని నమ్ముకుని.. అక్షరమే ఆయుధంగా మలచుకుని పోరాటం చేసిన వ్యక్తి రామోజీ రావు అని.. ఈనాడు, మార్గదర్శి, ఈటీవీతోపాటు విలువలతో కూడిన సినిమాలు తీసి సమాజానికి అందించారని రామోజీరావు సేవలు, విలువలను గుర్తు చేశారు సీఎం చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ రాజధానికి పేరును లోతుగా అధ్యయనం చేసి.. అమరావతి అని సూచించింది రామోజీరావు అని.. . రాజధాని నిర్మాణానికి రూ.10 కోట్ల విరాళం, కరోనా సమయంలోనూ రాష్ట్రానికి రూ.10 కోట్ల విరాళం ఇచ్చిన సంస్థ ఈనాడు గ్రూప్ అని రామోజీరావు సేవలను కొనియాడారు సీఎం చంద్రబాబు.
