కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించిన కన్నడ చిన్న చిత్రం 'ప్రేమద ఊరలి' (Premada Oorali), తెలుగులో 'ప్రేమనే ఊరిలో' బాక్సాఫీస్ ను షేక్ చేసింది. మౌత్ టాక్‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఏకంగా రూ.139 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం 60 షోలతో థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలకు సైతం సాధ్యం కాని రికార్డులను సృష్టించింది. ఎలాంటి భారీ ప్రమోషన్లు లేకుండా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ చిన్న సినిమా ఇప్పడు నవంబర్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
బాక్సాఫీస్ రికార్డు..
మనోజ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. తొలిరోజు కేవలం 60 షోలతో ప్రారంభమైన ఈ సినిమా.. ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ టాక్‌తో అనూహ్యంగా పుంజుకుంది. క్రమంగా షోల సంఖ్య పెరుగుతూ కర్ణాటక వ్యాప్తంగా వందలాది కేంద్రాలకు విస్తరించింది. విడుదలైన 26 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది. 50 రోజుల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. 53 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.139.32 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
కథేందంటే?
భార్యను కోల్పోయిన నాగన్న అనే రైతు.. తన కుమారుడు సంతును ఎంతో ప్రేమగా పెంచుతాడు. అతడికి మంచి చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో రుక్మిణి, వసంత పాత్రలతో కథలో ప్రేమ, భావోద్వేగాలు, కుటుంబ బంధాలు ఆసక్తికరంగా మలుపులు తిరుగుతాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో తండ్రి కొడుకుల అనుబంధం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రంగాయణ రఘు, శ్రీ రామ్, తపస్విని పూనాచ, రామిక శివు ప్రధాన పాత్రల్లో నటించారు. సునాద్ గౌతమ్ సంగీతం అందించగా, రాజ్‌కాంత్ ఎస్.కె సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
ఓటీటీలో ఎన్ని భాషల్లో?
థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులకు ఇప్పుడు ఇంట్లోనే సినిమా చూసే అవకాశం వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. తెలుగులో 'ప్రేమనే ఊరిలో' పేరుతో విడుదలైన ఈ సినిమా.. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
