మహిళలకు పెద్దపీట.. కొత్త పింఛన్లలో 3.5 లక్షల మంది మహిళలే: మంత్రి సీతక్క

మహిళలకు పెద్దపీట.. కొత్త పింఛన్లలో 3.5 లక్షల మంది మహిళలే: మంత్రి సీతక్క

ములుగు: రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.70 లక్షల మందికి నూతన చేయూత పింఛన్లు మంజూరు చేశామని తెలిపారు. వీరిలో 3.5 లక్షల మంది మహిళలు ఉన్నారని వెల్లడించారు.

ఏళ్ల తరబడి పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించిందని సీతక్క అన్నారు. దివ్యాంగులతో పాటు తలసేమియా బాధితులకు సైతం కొత్తగా పింఛన్లు మంజూరు చేసి పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

కొత్తగా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల ఆనందం, వారి కుటుంబాలకు అందుతున్న ఆర్థిక భరోసా తనకు ఎంతో సంతృప్తినిస్తోందని మంత్రి తెలిపారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

మరోవైపు ములుగు నియోజకవర్గ అభివృద్ధిపై కూడా మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 14 విద్యుత్ ఉపకేంద్రాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు సైతం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.

అలాగే రామప్ప–లక్నవరం అనుసంధాన పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను సమాంతరంగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.