హైదరాబాద్ వాసులకు దాదాపు 11 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఐమ్యాక్స్ ( IMAX ) అనుభూతి మళ్లీ అందుబాటులోకి రాబోతోంది. ఒకప్పుడు ప్రసాద్స్ ఐమ్యాక్స్‌లో 70ఎంఎం స్క్రీన్‌పై సినిమాలు చూసిన అనుభూతిని మళ్లీ గుర్తు చేసేలా సరికొత్త ఐమ్యాక్స్ థియేటర్ సిద్ధమవుతోంది. అది కూడా సూపర్‌స్టార్ మహేశ్ బాబు భాగస్వామిగా ఉన్న ఏఎంబీ సినిమాస్ నుంచి కావడం మరింత ఆసక్తి నెలకొంది.
ఫస్ట్ మూవీ అదే!
RTC X రోడ్స్‌లో ఉన్న ఐకానిక్ సుదర్శన్ 70ఎంఎం థియేటర్ స్థలంలో ఏఎంబీ విక్టరీ సినిమాస్ (AMB Victory Cinemas) పేరుతో భారీ మల్టీప్లెక్స్ సిద్ధమవుతోంది. ఈ భారీ ప్రాజెక్టు ఏషియన్ సినిమాస్, మహేశ్ బాబు, వెంకటేశ్ భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటోంది. మొత్తం ఏడు స్క్రీన్లతో నిర్మిస్తున్న ఈ మల్టీప్లెక్స్‌లో ఒక ఐమ్యాక్స్ విత్ లేజర్ స్క్రీన్, ఒక 4DX స్క్రీన్‌తో పాటు మరో ఐదు సాధారణ స్క్రీన్లు ఉండనున్నాయి.
డిసెంబర్ 18, 2026న ప్రేక్షకుల కోసం ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'డ్యూన్: పార్ట్ త్రీ' (Dune: Part Three) ఈ థియేటర్‌లో ప్రదర్శించే తొలి సినిమాగా ప్రచారంలో ఉంది. అధికారిక ఐమ్యాక్స్ వెబ్‌సైట్‌లోనూ ఈ వేదిక కనిపించడం ఆసక్తిని మరింత పెంచుతోంది.
ఐమ్యాక్స్ విత్ లేజర్..
ఈ కొత్త స్క్రీన్‌లో అత్యాధునిక IMAX with Laser టెక్నాలజీని ఉపయోగించనున్నారు. సాధారణ స్క్రీన్లతో పోలిస్తే మరింత స్పష్టమైన 4K విజువల్స్, మెరుగైన కాంట్రాస్ట్, అద్భుతమైన కలర్ క్వాలిటీ, శక్తివంతమైన ఆడియో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనున్నాయి. ముఖ్యంగా భారీ యాక్షన్ సన్నివేశాలు, సైన్స్ ఫిక్షన్ సినిమాలు, విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన చిత్రాలను చూసేందుకు ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
హకీంపేటలోనూ మరో ఐమ్యాక్స్?
ఇదే సమయంలో హైదరాబాద్‌లోని హకీంపేటలో కూడా ఏఎంబీ సినిమాస్ ద్వారా మరో ఐమ్యాక్స్ స్క్రీన్ ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి 1.43:1 ట్రూ ఐమ్యాక్స్ అనుభూతిపై కూడా చర్చ జరుగుతోంది. అయితే దీనిపై పూర్తి అధికారిక వివరాలు ఇంకా రావాల్సి ఉంది.
