Tirumala: ‘అలియాస్ రుక్మిణి’పై భారీ ఆశలు.. విడుదలకు ముందు శ్రీవారి సన్నిధిలో నితిన్

Tirumala: ‘అలియాస్ రుక్మిణి’పై భారీ ఆశలు.. విడుదలకు ముందు శ్రీవారి సన్నిధిలో నితిన్

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ నాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘అలియాస్ రుక్మిణి’పైనే ఉన్నాయి. డిసెంబర్ 4న సినిమా విడుదల కానుండటంతో తాజాగా చిత్రబృందంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగిందని తెలిపిన నితిన్.. తమ సినిమాను థియేటర్లలో తప్పకుండా చూడాలని అభిమానులను కోరారు. దీంతో ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ బాక్సాఫీస్ వద్ద కమ్‌బ్యాక్ ఇస్తారా? అన్న ఆసక్తి నెలకొంది.

‘అలియాస్ రుక్మిణి’ కథ ఇదేనా.. భార్య పేరుతో నవలలు 

‘అలియాస్ రుక్మిణి’ ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఇందులో నితిన్ కృష్ణ అనే రచయిత పాత్రలో కనిపించనున్నారు. ఆయన రాసే రొమాంటిక్, బోల్డ్ నవలలు మాత్రం భార్య రుక్మిణి పేరుతో ప్రచురితమవుతుంటాయి. దీంతో అసలు రచయిత కృష్ణ అయినప్పటికీ, రుక్మిణి బెస్ట్ సెల్లింగ్ రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇలా భార్య పేరుతో భర్త రచనలు చేయడం వెనుక ఉన్న కారణాలు, వారి మధ్య చోటుచేసుకునే ఆసక్తికర పరిణామాల చుట్టూ సినిమా కథ సాగనున్నట్లు ద్వారా తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో అఫియా సయ్యద్ రుక్మిణి పాత్రలో నటిస్తున్నారు. ప్రేమ, కామెడీ, భార్యాభర్తల మధ్య భావోద్వేగాలు, ఆసక్తికరమైన మలుపులతో దర్శకుడు మురళీ కాంత్ దేవసోత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘రుక్కు రుక్కు రుక్మిణి’ పాటకు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. నాని సమర్పణలో దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

నితిన్‌కు హిట్ తప్పనిసరి.. 

వరుస విజయాలతో కెరీర్ ప్రారంభించిన నితిన్‌కు ఇటీవల కాలంలో ఆశించిన హిట్స్ దక్కడం లేదు. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘రాబిన్‌హుడ్’, ‘తమ్ముడు’ వంటి సినిమాలు నిరాశపరిచాయి. దీంతో తదుపరి చిత్రాల విషయంలో నితిన్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బలమైన కథ, మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ, బడ్జెట్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ‘అలియాస్ రుక్మిణి’ నితిన్‌కు కీలకంగా మారింది. 

నితిన్ మరోసారి సక్సెస్ ట్రాక్‌లోకి వస్తారా?

‘అలియాస్ రుక్మిణి’ తర్వాత నితిన్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నారి సిరిస్వాద, సోమశేఖర్ ద్వయం దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దర్శకుడు విఐ ఆనంద్‌తో కూడా నితిన్ ఓ ప్రాజెక్ట్ చేసే అవకాశముందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే ‘ఆయ్’ ఫేమ్ అంజి బాబుతో మరో సినిమా చేయడానికి సంప్రదింపులు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టులపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మొత్తానికి డిసెంబర్ 4న విడుదల కానున్న ‘అలియాస్ రుక్మిణి’ నితిన్ కెరీర్‌కు ఎలాంటి మలుపు తీసుకొస్తుందో చూడాలి. నాని నిర్మాణం, ‘దండోరా’ దర్శకుడి కథనం, విజయ్ బుల్గానిన్ సంగీతం.. ఇలా సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంతోనైనా నితిన్ బాక్సాఫీస్ వద్ద తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి వస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.