కార్తీకమాసం వచ్చిందంటే చాలు.. పొద్దున్నే చలి ఇరగదీస్తున్నా.. హరహరమహాదేవ అంటే చన్నీళ్లతో స్నానం చేస్తారు. చాలా మంది నదీ తీరాలకు వెళ్లి అక్కడే స్నానం చేసి దీపాలను నదుల్లో వదులుతారు. ఇక శివాలయాల్లో భక్తుల హడావిడి అంతా ఇంతా కాదు.. ఉసిరి దీపాలు.. అభిషేకాలు ఇలా భక్తి తన్మయత్వంలో మునిగిపోతారు. ఒక్క మానవులకే దేవుళ్లు కూడా ఈ మాసంలో శివ కేశవులను పూజించారని పురాణాల ద్వారా తెలుస్తుంది.
సత్య యుగంలో సాక్షాత్తు విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి భూలోకంలో సంచ రిస్తే కార్తీకమాసం నవమి తిథి రోజున ఉసిరి చెట్టుకింద శివ కేశవులను పూజిస్తూ ఒక వ్రతాన్ని ఆచరించిందని పండితులు చెబుతున్నారు. తరువాత కాలంలో ఈ వ్రతాన్ని చేసినవారికి శివకేశవుల అనుగ్రహంతో.. లక్ష్మీ దేవి ఆశీస్సులు పుష్కలంగా లభించి అష్ట ఐశ్వర్యాలు రెట్టింపు అవుతాయని స్కాంద పురాణం ద్వారా తెలుస్తుంది. అదే అక్షయ నవమి వ్రతం.. ఇప్పుడు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !
2026లో అక్షయ నవమిని నవంబర్ 18వ తేదీ బుధవారం జరుపుకుంటారు. నవమి తిథి నవంబర్ 18న ఉదయం 6:04 గంటలకు ప్రారంభమై, నవంబర్ 19న ఉదయం 7:05 గంటలకు ముగుస్తుంది. పూజకు నవంబర్ 18న ఉదయం 6:46 నుంచి మధ్యాహ్నం 12:06 గంటల వరకు శుభ సమయంగా పరిగణిస్తారు.
శాస్త్రాల ప్రకారం ఉసిరి చెట్టును ధాత్రి వృక్షం అని, లక్ష్మీ నివాసం అని అంటారు. ఉసిరి లక్ష్మీ నారాయణుల కన్నీటి బిందువుల నుంచి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి.ఈ రోజున ఉసిరి చెట్టును పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది.లక్ష్మీ కటాక్షంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి.నవగ్రహ దోషాలు తగ్గి, ఆరోగ్యం, ఆయురారోగ్యాలు లభిస్తాయి.సకల పాపాలు తొలగిపోయి కుటుంబానికి దీర్ఘాయువు లభిస్తుందని స్కంద పురాణం చెబుతోంది.
అక్షయ అంటే ఎప్పటికీ తరగని, నశించనిది అని అర్థం. లక్ష్మీదేవి అక్షయ నవమి చేసిన రోజున అంటే కార్తీకమాసం శుక్ల పక్షం నవమి రోజున( 2026 నవంబర్18) చేసే పూజ, దానం, జపం ఎన్ని జన్మలకైనా తరగని పుణ్యఫలాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు.
కార్తీకమాసంలో విష్ణుమూర్తి భార్య శ్రీలక్ష్మీదేవి భూమిపైకి వచ్చినప్పుడు..శివకేశవులను పూజించాలనుకుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. . ఇద్దరినీ ఒకే సమయంలో పూజించడం ఎలా సాధ్యం అనుకున్న ఆ అమ్మవారు.. కార్తీకమాసం శుక్ల పక్షం నవమి రోజున ఉసిరి చెట్టును ఎంచుకుని అక్కడే పూజలు చేసింది.
శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని గుర్తించిన అమ్మవారు.. ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల ప్ర్రీతికి పాత్రమైందని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారు స్వయంగా ఉసిరి చెట్టుకింద వంటచేసి శివకేశవులకు నైవేద్యం సమర్పించిందని పండితులు చెబుతున్నారు. అందుకే ఉసిరి చెట్టు కింద పూజ చేయాలని పండితులు చెబుతారు.
అక్షయనవమి పూజా విధానం
- ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శుభ్రమైన, పసుపు రంగు బట్టలు ధరించండి.
- ఇంట్లో ఉసిరి చెట్టు లేకపోతే దగ్గరలోని ఉసిరి చెట్టు వద్దకు వెళ్లండి.
- ఉసిరి చెట్టు మొదట్లో గంగాజలం, పాలు పోసి శుభ్రం చేయండి.
- పసుపు, కుంకుమ, చందనం, పూలతో అలంకరించి, చెట్టు కాండానికి పవిత్రమైన కలవా దారాన్ని 7 లేదా 108 సార్లు చుట్టండి.
- ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఉసిరికాయను తొలిచి ప్రమిదగా చేసి అందులో దీపం వెలిగిస్తే మరింత విశేష ఫలితం ఉంటుంది.
- ఓం నమో భగవతే వాసుదేవాయ అని, ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అని జపం చేస్తూ ప్రదక్షిణలు చేయండి.
- అవకాశం ఉంటే చెట్టు కిందే వంట చేసి ముందుగా స్వామికి నైవేద్యం పెట్టి, తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయండి.
- చక్కెర పొంగలి, దద్ధోజనం నైవేద్యంగా పెట్టండి.
- అక్షయనవమి రోజున బట్టలు, ఆహారం, ఉసిరి కాయలు దానం చేస్తే అక్షయ ఫలితం వస్తుంది.
- ఈ ఏడాది నవంబర్ 18న ఒక్క రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సంపదకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
