హైదరాబాద్, వెలుగు: ఏపీ బనకచర్ల ప్రాజెక్టును పట్టాలెక్కించే కుట్రలో భాగంగానే తెలంగాణకు చెందిన సమ్మక్కసాగర్ బ్యారేజీ డీపీఆర్‌ను సెంట్రల్వాటర్కమిషన్(సీడబ్ల్యూసీ) వెనక్కి పంపిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 46.96 టీఎంసీల గోదావరి జలాలను ఉపయోగించుకుని 4.40 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 30 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చేలా రూపొందించిన సమ్మక్కసాగర్ డీపీఆర్‌ను నవంబర్ 10న వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. 100 శాతం కమాండ్ ఏరియా సర్వే వివరాలు లేవని, సీడీవో సర్టిఫికెట్ లేదని సాంకేతిక కారణాలు చూపినప్పటికీ.. దీని వెనుక అసలు కారణం ‘గోదావరి–కావేరి (జీసీ) లింక్’–‘పోలవరం–బనకచర్ల’ కుట్రేనన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
గతంలో నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) మన రాష్ట్రంలోని ఇచ్చంపల్లి లేదా సమ్మక్కసాగర్ నుంచి 148 టీఎంసీల నీటిని తరలించేలా గోదావరి–కావేరి అనుసంధానాన్ని ప్రతిపాదించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక ఓకే చెప్పినా.. ఏపీ మాత్రం అడ్డం పడుతున్నది. ఇచ్చంపల్లి లేదా సమ్మక్కసాగర్ నుంచి నీళ్లు మళ్లిస్తే తమ పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు దెబ్బ తగులుతుందని భావించిన చంద్రబాబు.. ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖలు రాశారు. సమ్మక్కసాగర్‌కు సీడబ్ల్యూసీ అనుమతులు వస్తే భవిష్యత్తులో బనకచర్ల వద్ద నీటి లభ్యత లేదన్న వాదన బలపడుతుందనే, కావాలనే సమ్మక్కసాగర్ డీపీఆర్‌ను కేంద్రం తొక్కిపెట్టి వెనక్కి పంపిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
