తీవ్ర తుఫాన్ గా అక్వాన్ : చాలా నెమ్మదిగా తీరం వైపు

తీవ్ర తుఫాన్ గా అక్వాన్ : చాలా నెమ్మదిగా తీరం వైపు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాన్ తీవ్ర తుపానుగా మరింత బలపడింది. తీరం వైపు నెమ్మదిగా కదులుతోంది. గత ఆరుగంటలనుంచి  గంటకు కేవలం 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ప్రస్తుతం చెన్నైకి 580 కిలోమీటర్లు, మచిలీపట్నం, విశాఖపట్నానికి 610 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ఎల్లుండి(నవంబర్ 20) మధ్యాహ్నానికి  తీరందాటే అవకాశం కనిపిస్తోంది వాతావరణ శాఖ అంచనా వేసింది. 

అక్వాన్ తుఫాన్ ప్రభావంతో రేపు, ఎల్లుండి  ఏపీలోని పలు జిల్లాల్లో అతినుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. అక్కడక్కడ భారీనుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.  ఎల్లుండి మధ్యాహ్నానికి తీరం నెల్లూరు, విశాఖపట్నం మద్య తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని ఆ సమయంలో గంటలకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. 

తుపాన్ గమనాన్ని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్టీజీఎస్ సమన్వయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి.  జిల్లా అధికారులను అలర్ట్ చేశారు. అత్యవసర సహాయక చర్యల కోసం 13 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానిక అగ్నిమాపక సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు.

తీర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుపాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.