TCS, హెచ్‌సీఎల్‌టెక్‌లను ఓడించిన కాగ్నిజెంట్: యూకేలో భారీ డీల్

TCS, హెచ్‌సీఎల్‌టెక్‌లను ఓడించిన కాగ్నిజెంట్: యూకేలో భారీ డీల్

అమెరికాకు చెందిన ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ తన ఖాతాలో మరో భారీ ప్రాజెక్టును వేసుకుంది. యూకేకి చెందిన ప్రముఖ రైల్వే మౌలిక సదుపాయాల సంస్థ 'నెట్‌వర్క్ రెయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్' నుంచి సుమారు రూ.1,470 కోట్లు విలువైన భారీ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్‌ను సొంతం చేసుకుంది. అయితే పన్నులతో కలిపితే ప్రాజెక్టు విలువ రూ.1,765 కోట్లకు చేరుకుంది. 

పోటీదారులను దాటుకుని..
ఈ కాంట్రాక్ట్ కోసం జరిగిన పోటీలో భారత్ నుంచి TCS, హెచ్‌సీఎల్‌టెక్ తో పాటు అంతర్జాతీయ సంస్థలైన డీఎక్స్సీ టెక్నాలజీ, అటోస్ బరిలో నిలిచాయి. మొత్తం 5 సంస్థలు చివరి దశ వరకు పోటీ పడగా.. అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించిన కాగ్నిజెంట్ కాంట్రాక్టును దగ్గించుకుంది. సుమారు 7 ఏళ్ల పాటు కొనసాగనున్న ఈ కాంట్రాక్ట్ 2027 నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ ఒప్పందంలో భాగంగా నెట్‌వర్క్ రెయిల్ డేటా సెంటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్వహణ బాధ్యతలను కాగ్నిజెంట్ పూర్తిగా చూసుకోనుంది. 

కాగ్నిజెంట్ దూకుడు:
ప్రస్తుతం ఐటీ రంగంలో డిమాండ్ సవాళ్లతో కూడుకున్నప్పటికీ.. కాగ్నిజెంట్ వరుసపెట్టి పెద్ద ప్రాజెక్టులను దక్కించుకోవడం గమనార్హం. ఇటీవల అమెరికాకు చెందిన సెంటెన్ సంస్థ నుంచి $500 మిలియన్లకు పైగా విలువైన మెగా డీల్‌ను సొంతం చేసుకున్న కాగ్నిజెంట్.. ఇప్పుడేమో యూకేలో నెట్‌వర్క్ రెయిల్ ప్రాజెక్టుతో బ్రేక్ లేకుండా దూసుకుపోతోంది.