కొబ్బరికాయ కొట్టుడే కానీ.. గింజ కొంటలేరు: మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం

కొబ్బరికాయ కొట్టుడే కానీ.. గింజ కొంటలేరు: మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం

కంగ్టి/ నారాయణఖేడ్, వెలుగు: కొబ్బరికాయ కొట్టుడే కానీ.. గింజ కొంటలేరని, రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. మంగళవారం నారాయణఖేడ్ మండలంలో ఆయన పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాంపేట్ మండల కేంద్రంలో రైతులను కలిసినప్పుడు ఇంతవరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయని విషయం గుర్తించామన్నారు. ప్రభుత్వం కొనకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు   అమ్ముకున్నారన్నారు. ముఖమంత్రి రేవంత్​ రెడ్డి మాటలు నమ్మి సన్న వడ్లు సాగు చేసినందుకు రైతులు నష్టపోతున్నారన్నారు. అనేక జిల్లాలో క్వింటాలు రూ.2,600,  రూ.2,700 కే అమ్ముతుండగా, దొడ్డు వడ్లు కొనే దిక్కు లేదన్నారు.

ప్రభుత్వం కొనకపోవడంతో దళారులు దొడ్డు రకం వడ్లు రూ.2,200 క్వింటాల్ కొంటున్నారని, దీనితో రైతు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అంతేగాక క్వింటాల్ కు పది కిలోలు తరుగు పెడుతుండటంతో మరింత నష్టపోతున్నారన్నారు. రైతుకు బోనస్ విషయంలో జీవో ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితులు, కరెంట్ కోత కారణంగా రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినా ఇప్పటివరకు ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేయలేదని మండిపడ్డారు.

మహారాష్ట్ర, కర్ణాటకలలో ప్రతి రైతుకు ఎకరాకు రూ.5 వేల సాయం చేశారని, బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పంట నష్టపోతే ఎకరాకు రూ.10 వేలు ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, యాసంగి రైతుబంధు డబ్బులు విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. ఇవ్వని పథకాలకు రాజీవ్, ఇందిరాగాంధీ పేర్లు పెట్టి ప్రజలను గోస పెడుతున్నారని ఎద్దేవా చేశారు.

నారాయణఖేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చనిపోయిన రైతులకు ప్రభుత్వం ప్రీమియం కట్టకపోవడం వల్ల రైతు బీమా రావడం లేదని, కొత్త బీమా ఇంటికోక్కరికే అనడం వల్ల ఎలాంటి లాభం లేదని, ఇప్పటివరకు రాష్ట్రంలో చనిపోయిన 3 వేల మంది రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పాల్గొన్నారు.