విమానం ఆలస్యం తో ముంబై ఎయిర్ పోర్టు లో గందరగోళం నెలకొంది. నాలుగు గంటల పాటు విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. విమానం రాకపోకలపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో అసహనం కోల్పోయిన ప్యాసింజర్లు సిబ్బందిని నిలదీశారు. బాగ్డోగ్రా నుంచి అహ్మదాబాద్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంతో ఈ గందరగోళం ఏర్పడింది. వివరాల్లోకి వెళితే..
ముంబై: బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన పలు విమానాలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ముంబై విమానాశ్రయంలో విమానాల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి రావడంతో ప్రయాణికుల్లో అసహనం నెలకొంది. సాయంత్రం 7 గంటల నుంచే ఎదురుచూస్తున్న ప్రయాణికులకు విమానాల బయలుదేరే సమయాలపై సరైన సమాచారం అందకపోవడంతో పలువురు ప్రయాణికులు స్పైస్‌జెట్ కౌంటర్ వద్దకు చేరుకుని సిబ్బందిని ప్రశ్నించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా విమానాల ఆలస్యం కొనసాగింది.
బాగ్డోగ్రా నుంచి అహ్మదాబాద్ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం పలుమార్లు వాయిదా పడి చివరకు రద్దయింది. దీంతో సుమారు 50 నుంచి 70 మంది ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. చివరి నిమిషంలో ప్రత్యామ్నాయ విమాన టికెట్లు అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి రావడంతో పాటు హోటల్ వసతికి కూడా సొంతంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని ప్రయాణికులు వాపోయారు.
ఓ బాధితురాలు కాజల్ మోహతా సోషల్ మీడియాలో స్పందిస్తూ, ప్రయాణికుల కోసం ఎలాంటి సహాయం అందించలేదని విమర్శించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ప్రయాణికులు కలిపి లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చిందని అన్నారు . విమానాల ఆలస్యం, విమానాల రద్దుపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ముంబై విమానాశ్రయంలో జరిగిన అంతరాయాలపై స్పైస్‌జెట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
