ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌లో లోయలో పడ్డ బస్సు, బొలెరో.. 10 మంది మృతి

ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌లో లోయలో పడ్డ బస్సు, బొలెరో.. 10 మంది మృతి

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. లోయల్లోకి వాహనాలు దూసుకెళ్లిన ఈ ఘటనల్లో మొత్తం 10 మంది మృతి చెందగా, మరో 20 మందికి పైగా గాయపడ్డారు. తెహ్రీ గర్వాల్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో హరిద్వార్ నుంచి చమోలీకి ప్రైవేట్​బస్సు బయల్దేరింది.

గులార్ వంతెన సమీపంలోకి రాగానే బస్సు అదుపుతప్పి దాదాపు 100 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.

రుద్రప్రయాగ్‌‌‌‌‌‌‌‌లో నలుగురు మృతి..

మరోవైపు, రుద్రప్రయాగ్ జిల్లాలోని బన్వాడా-మోహన్‌‌‌‌‌‌‌‌ఖాల్ మోటర్ రోడ్డుపై మరో రోడ్డు ప్రమాదం జరిగింది. పోఖారి నుంచి రాన్సీ వెళ్తున్న బొలెరో వాహనం భట్వారీ- కందారా వద్దకు రాగానే అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగస్త్యముని పోలీసులు, ఎస్‌‌‌‌‌‌‌‌డీఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్, డీడీఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడ్డవారిని లోయ నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.

ఈ వరుస ప్రమాదాలతో ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఈ రెండు ప్రమాదాలపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు.

ఢిల్లీలో భవనం కూలి ఇద్దరు మృతి 

ఢిల్లీలో వివేక్ విహార్ ప్రాంతంలో మంగళవారం రెండంతస్తుల పాత భవనం కూలి ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో మూడేళ్ల చిన్నారితో పాటు లడ్డు అలియాస్ దేవాన్ష్ (27) ఉన్నారు. మరో నలుగురిని కూలీలను రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.