న్యూఢిల్లీ: 2002 గుజరాత్ అల్లర్ల సందర్భంగా జరిగిన గ్యాంగ్‌రేప్ కేసులో ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంపై బాధితురాలు బిల్కిస్ బానో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఉత్తర్వులపై తాను కచ్చితంగా పోరాడతానని తెలిపారు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా, తన వాదన వినకుండా శిక్షను న్యాయస్థానం ఎలా నిలిపివేస్తుందని ప్రశ్నించారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ ఆదేశాలను సవాలు చేస్తానని ఆమె స్పష్టం చేశారు.
ఈ మేరకు మంగళవారం తన న్యాయవాది ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నన్ను పిలవకుండా, నా వాదన వినకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం ఇది రెండోసారి. ఇద్దరు దోషులు బిపిన్‌చంద్ జోషి, ప్రదీప్ మోధియాలకు బెయిల్ ఇచ్చారనే విషయం నాకు పత్రికా వార్తల ద్వారానే తెలిసింది’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
న్యాయం కోసం 24 ఏండ్లుగా పోరాడుతున్న. తాజా కోర్టు ఉత్తర్వులతో నేను మళ్లీ ఓడిపోతానేమోనన్న భయమేస్తోంది. న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందన్న అనుమానం కలుగుతుంది. దోషులు బయటకు రావడంతో నాకు, నా ఫ్యామిలీకి భద్రత లేదన్న టెన్షన్ మళ్లీ మొదలైంది. ఈ భయాలు, గాయాలతో నా పిల్లలు బతకకూడదు. వారి కోసమే నేను కోర్టు ఆర్డర్‌ను సవాలు చేస్తా’’ అని ఆమె స్పష్టం చేశారు.
