- ముషీరాబాద్ హోమ్‌లో 3వ తరగతి విద్యార్థిని మృతి
- మరో స్టూడెంట్కు తీవ్ర గాయాలు
ముషీరాబాద్, వెలుగు: తోటి విద్యార్థులతో కలిసి సరదాగా ఆడుకుంటున్న ఓ విద్యార్థి కరెంటు షాక్ తో కన్ను మూసింది. ఈ ఘటనలో మరో విద్యార్థి తీవ్రంగా గాయపడింది. ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న సంగం రెబెక్కా(11) స్కూల్ ప్రాంగణంలో ఉన్న నైటింగేల్హోమ్ ఫర్ గర్ల్స్ హాస్టల్లో ఉంటోంది. మొదటి అంతస్తులో ఉంటున్న రెబెక్కా సోమవారం సాయంత్రం నందిని (14), జయశ్రీ (9) అనే మరో ఇద్దరు విద్యార్థినులతో కలిసి టెర్రస్‌పైకి వెళ్లింది.
అక్కడున్న ఇనుప రాడ్ (స్టీల్ హ్యాండిల్) కలిగిన మాప్ కర్రతో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ బిల్డింగ్ మీదుగా వెళ్తున్న 11 కేవీ హైటెన్షన్ కరెంట్ వైరుకు మాప్ తాకింది. దీంతో షాక్ కొట్టడంతో రెబెక్కా అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది. ఇది చూసి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన నందిని చేతులకు గాయాలయ్యాయి. జయశ్రీ వెంటనే కిందికి పరిగెత్తి వసతి గృహ సిబ్బందికి చెప్పగా, వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
