లండన్: డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వస్తానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా చేసిన ప్రకటనతో ఆమె మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య ఘర్షణలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా బంగ్లాదేశ్‌కే పరిమితమైన ఈ ఉద్రిక్తతలు ఇప్పుడు బ్రిటన్ వీధులకూ పాకాయి. సోమవారం రాత్రి తూర్పు లండన్‌లోని రామ్‌ఫోర్డ్ ప్రాంతంలో బంగ్లాదేశ్‌కు చెందిన నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సీపీ), అవామీ లీగ్ మద్దతుదారులు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు.
విద్యార్థి ఉద్యమ నేత, ప్రస్తుత ఎన్‌సీపీ అధినేత నహీద్ ఇస్లాం ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్నారు. ఆయన గౌరవార్థం రామ్‌ఫోర్డ్‌లోని మేఫెయిర్ హాల్‌లో ప్రవాస బంగ్లాదేశీయులు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం జరుగుతుండగానే హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు మేఫెయిర్ హాల్ బయట నిలబడి.. సభకు వస్తున్న అతిథులపై కోడిగుడ్లు, వాటర్ బాటిల్స్ విసిరారు. సన్మాన సభ ముగిసిన తర్వాత అక్కడ పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం ముదిరి తోపులాటకు దారితీసింది.
