వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌లో ‘డర్టీ బాంబ్’ పేల్చేందుకు ఇరాన్ కుట్ర.. అమెరికా నిఘా వర్గాల హెచ్చరిక

వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌లో ‘డర్టీ బాంబ్’ పేల్చేందుకు ఇరాన్ కుట్ర.. అమెరికా నిఘా వర్గాల హెచ్చరిక

వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలోని కీలక అధికారులను లక్ష్యంగా చేసుకుని వాషింగ్టన్ డీసీలో రసాయన ఆయుధం(కెమికల్ వెపన్) లేదా 'డర్టీ బాంబ్' పేల్చేందుకు ఇరాన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ కుట్రకు సంబంధించిన ప్రాంతాలు, లక్ష్యాలతో సహా కీలక వివరాలను అధికారులు సేకరించినట్లు సమాచారం. నిఘా హెచ్చరికల నేపథ్యంలో అమెరికాలో భద్రతా చర్యలు, ఉన్నతాధికారుల తరలింపు వేగవంతమయ్యాయి. అయితే, తాము అన్ని రకాల ముప్పులను నిశితంగా గమనిస్తున్నామని, ప్రస్తుతానికి దేశానికి ఎలాంటి విశ్వసనీయమైన ముప్పు లేదని వైట్‌‌‌‌‌‌‌‌హౌస్ ప్రతినిధి లారెన్ బిస్ స్పష్టం చేశారు.

ఇరాన్‎లోని మినాబ్ పాఠశాలపై జరిగిన దాడిలో 123 మంది చిన్నారులు మరణించడానికి కారణమైన ఇద్దరు అమెరికా నావికాదళ అధికారులను ఇటీవల ఇరాన్ బెదిరించింది. ఇరాన్ ముప్పు నేపథ్యంలో అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్‌‌‌‌‌‌‌‌ను ఆయన నివాసం నుంచి సైనిక స్థావరానికి తరలించారు. అమెరికా గడ్డపైనే దాడులకు టెహ్రాన్ చురుగ్గా ప్రణాళికలు రచిస్తోందని, అయితే ఈ దాడులను అమలు చేయడానికి వారి వద్ద తగిన సిబ్బంది ఉన్నారా లేదా అనే దానిపై చర్చ జరుగుతోందని సీఎన్ఎన్ పేర్కొంది. 

2024లో ట్రంప్‌‌‌‌‌‌‌‌పై జరిగిన హత్యాయత్నం కుట్ర సహా, విదేశాల్లో పర్యటిస్తున్న అమెరికా అధికారులపైనా ఇరాన్ దాడులకు ప్రయత్నించిందని నివేదిక తెలిపింది. అమెరికా గడ్డపై బాంబు తయారీ సామగ్రిని దాచిపెట్టడంపై ఇరానియన్లు చర్చించుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 

సాధారణ పేలుడు పదార్థాలకు అణు లేదా రసాయన ఏజెంట్లను జోడించేందుకు వీలుగా ఇరాన్ ఇప్పటికే అమెరికాలో వాటిని సిద్ధం చేసి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ ఆరోపణలను ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ మిషన్ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రసాయన ఆయుధాల వినియోగాన్ని తాము పూర్తిగా చట్టవిరుద్ధంగా పరిగణిస్తామని, ఈ విషయంలో తప్పుడు, కల్పిత ఆరోపణలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నామని స్పష్టం చేసింది. 

ఏమిటీ డర్టీ బాంబ్..?

ట్రంప్‌‌‌‌‌‌‌‌నకు తమ సందేశాన్ని పంపడానికి అమెరికా లోపల ఏదో ఒక దాడి జరిపితే చాలని ఇరాన్ భావిస్తోంది. సాధారణ అణు బాంబులా కాకుండా 'డర్టీ బాంబ్'లో అణు విచ్ఛిత్తి (న్యూక్లియర్ ఫిషన్) జరగదు. కానీ, ఇది పేలినప్పుడు కిలోమీటర్ల మేర గాలిలో ప్రమాదకరమైన రేడియేషన్‌‌‌‌‌‌‌‌ను వ్యాపింపజేస్తుంది. రేడియేషన్ వల్ల తక్షణ మరణాలు సంభవించకపోయినా బాంబు పేలుడు తీవ్రత ప్రాణాంతకంగా ఉంటుందని, ఆయా ప్రాంతాలు నివాసయోగ్యం కాకుండా పోతాయని నిపుణులు చెబుతున్నారు.