కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులంలోని పదో తరగతి విద్యార్థులు వాచ్మెన్పై దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కోరుట్లలోని కల్లూరు రోడ్డులో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం అర్ధరాత్రి కొంతమంది విద్యార్థులు వీరంగం సృష్టించారు. నైట్ వాచ్మెన్ తిరుపతిపై మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారు.
రాత్రివేళ విద్యుత్ నిలిపివేసి ఓ గదిలో నిద్రిస్తున్న వాచ్మెన్పై విద్యార్థులు అందుబాటులో ఉన్న వస్తువులతో దాడి చేశారు. వాచ్మెన్ అరుపులు విన్న ఉపాధ్యాయుడు నరేందర్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ఆయనకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో పాఠశాలలోని ఫర్నిచర్, టీవీతో పాటు వాచ్మెన్కు చెందిన బైక్ను ధ్వంసం చేశారు.
కొంతమంది విద్యార్థులు రాత్రివేళల్లో గదుల నుంచి బయటకు వచ్చి తిరగడం, ఇతర విద్యార్థులతో దురుసుగా ప్రవర్తిస్తున్న విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లినందుకే తనపై కక్ష పెంచుకుని దాడి చేశారని బాధితుడు తిరుపతి తెలిపారు. విద్యార్థుల నుంచి తనకు ప్రాణభయం ఉందని, తనను మరో పాఠశాలకు బదిలీ చేయాలని కోరారు.
విషయం తెలుసుకున్న జిల్లా ఇన్చార్జి జోనల్ అధికారి పూర్ణచందర్రావు కళాశాలను సందర్శించి, దాడికి పాల్పడిన విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు ఎస్సై బాబురావు ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
