కరీంనగర్/చిగురుమామిడి/ సిద్దిపేట రూరల్, వెలుగు: సరైన ఆధారాలు లేక పెన్షన్లు తిరస్కరణకు గురైన వారికి మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో కొత్తగా పెన్షన్ మంజూరైన లబ్ధిదారులకు ఆయన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 4.68 లక్షల కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేసినట్టు చెప్పారు.
వృద్ధులకు పెన్షన్లు అందించాలనే డిమాండ్ మేరకు త్వరలోనే దరఖాస్తులు స్వీకరించి అర్హులందరికీ పెన్షన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 19 నుంచి కొత్త పెన్షన్ల నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో రాజకీయ వివక్షకు తావులేకుండా అర్హులైన పేదలకు, ఆడపిల్లలు ఉన్న కుటుంబాలకు, గుడిసెల్లో నివసించే వారికి ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు, ఫోన్లు, టీవీలకు బానిసలు కాకుండా క్రీడల వైపు మళ్లించేందుకు ప్రతి గ్రామంలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో కోర్టులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
క్రీడా మైదానాలు, వాకింగ్ ట్రాక్ల ఏర్పాటుకు చిన్న గ్రామాలకు రూ.లక్ష, పెద్ద గ్రామాలకు రూ.2 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రామిశ్రా తదితరులు పాల్గొన్నారు. కాగా, దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెడుతున్న ‘ఇందిరమ్మ కుటుంబ బీమా’ పథకాన్ని ఈనెల 19న సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సభా స్థలాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ శంకర్ నాయక్తో కలిసి ఆయన మంగళవారం సందర్శించారు.
