అర్హులందరికీ పింఛన్లు అందిస్తాం: మంత్రి సీతక్క

అర్హులందరికీ పింఛన్లు అందిస్తాం: మంత్రి సీతక్క

ఏటూరునాగారం, వెంకటాపూర్, తాడ్వాయి, మంగపేట, వెలుగు: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించి నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మంగళవారం ములుగు జిల్లా ఏటూరునాగారం, గోవిందరావుపేట, తాడ్వాయి, మంగపేట మండలాల్లో పర్యటించిన మంత్రి అర్హులైన లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు.

ఏటూరు నాగారం మండలంలోని 12 గ్రామ పంచాయతీల పరిధిలో 463 మందికి, గోవిందరావుపేట మండలంలోని 18 గ్రామ పంచాయతీల పరిధిలో 487 మందికి, తాడ్వాయి మండలంలోని 18 గ్రామ పంచాయతీల పరిధిలో 306 మందికి, మంగపేట మండలంలో 659 మందికి మంజూరు పత్రాలు అందించారు.

అనంతరం ఏటూరునాగారంలో రూ.68.10 లక్షలతో విద్యుత్ డివిజన్ కార్యాలయ భవన నిర్మాణానికి, తాడ్వాయిలో రూ.17 లక్షలతో, గోవిందరావుపేట మండలం చల్వాయిలో రూ.3.19 కోట్లతో విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. మంగపేట మండలం రాజుపేటలో కొత్తగా నిర్మించిన వీవో భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఏటూరునాగారం పీవో లెనిన్ వత్సల్ టొప్పో, ఏఎస్పీ మనన్ భట్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, మార్కెట్ కమిటీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ రేగ కల్యాణి, డీఆర్డీవో చంద్రశేఖర్, జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ రఘు తదితరులు పాల్గొన్నారు.