Ranu Bombai Ki Ranu: అల్లు అర్జున్ 'బుట్టబొమ్మ'ను బీట్ చేసిన తెలంగాణ ఫోక్ సాంగ్.. ఏడాదిన్నరలోనే 957 మిలియన్ల వ్యూస్!

Ranu Bombai Ki Ranu: అల్లు అర్జున్ 'బుట్టబొమ్మ'ను బీట్ చేసిన తెలంగాణ ఫోక్ సాంగ్.. ఏడాదిన్నరలోనే 957 మిలియన్ల వ్యూస్!

తెలంగాణ పల్లె పాటలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.  స్టార్ హీరోలు, భారీ సినిమాలు, కోట్ల రూపాయల బడ్జెట్లు అవసరం లేకుండానే ఒక సాధారణ జానపద గీతం యూట్యూబ్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  'బుట్టబొమ్మ ' సాంగ్ రికార్డులను బద్దలు కొట్టింది.  ఇంతకీ ఆ పాట ఏంటంటే.. తెలంగాణ ఫోక్ సెన్సేషన్ 'రాను రాను బొంబాయికి రాను'.

బుట్టబొమ్మను వెనక్కి నెట్టేసి..

అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అలా వైకుంఠపురములో' మూవీలో 'బుట్టబొమ్మ' పాట ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్, పూజా హెగ్డే డ్యాన్స్, థమన్ అందించిన సంగీతం ఈ పాటను ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేశాయి. దాదాపు ఆరేళ్లలో ఈ పాట 955 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి అత్యధిక వ్యూస్ పొందిన తెలుగు పాటగా నిలిచింది.

 

అయితే ఇప్పుడు ఆ రికార్డును తెలంగాణ ఫోక్ సాంగ్ 'రాను బొంబాయికి రాను' అధిగమించింది. 2025 జనవరి 23న రాథోడ్ ట్యూన్స్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదలైన ఈ పాట కేవలం ఏడాదిన్నరలోనే 957 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. అంటే దాదాపు 95.7 కోట్ల వ్యూస్‌తో తెలుగు పాటల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. 

పాట వెనుక ఉన్నది వీళ్లే..

రాము రాథోడ్ రాసి ఆలపించిన ఈ పాటకు ప్రభ కూడా తన గాత్రాన్ని అందించారు. లిఖిత ఈ పాటలో నటించి ఆకట్టుకున్నారు. కల్యాణ్ కీస్ సంగీతం, అదిరిపోయే జానపద బాణీ, తెలంగాణ యాసలోని పదాలు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పల్లెటూరి వాతావరణం, డ్యాన్స్ బీట్, సులభంగా గుర్తుండిపోయే లిరిక్స్‌తో ఈ పాట యువతను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. 

ఇంకా ఏ పాటలు టాప్‌లో ఉన్నాయి?

ప్రస్తుతం అత్యధిక వ్యూస్ సాధించిన దక్షిణాది పాటల జాబితాలో ధనుష్ నటించిన 'మారి 2' సినిమాలోని 'రౌడీ బేబీ' సుమారు 1.77 బిలియన్ల వ్యూస్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక తెలుగు పాటల్లో 'బుట్టబొమ్మ' రెండో స్థానానికి, మహేశ్ బాబు 'గుంటూరు కారం'లోని ‘కుర్చీ మడతపెట్టి’ పాట మూడో స్థానానికి చేరాయి.  సినిమా పాటలకే పరిమితమైన యూట్యూబ్ రికార్డులను తెలంగాణ జానపద గీతం తిరగరాయడం... పల్లె పాటకు పట్టం కడుతున్న ప్రేక్షకుల అభిరుచికి ఈ విజయం నిదర్శనమనే చెప్పాలి...