తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాకిటి శ్రీహరి

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి తెలంగాణ క్రీడా సత్తాను దేశానికి చాటుతామని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు ప్రధాన వేదికగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ కోసం రూ.203.36 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రీడా వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

రాష్ట్రంలో క్రీడా రంగాన్ని దీర్ఘకాలిక ప్రణాళికతో అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు వెల్లడించారు. క్రీడా వేదికల నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇన్వెస్ట్ తెలంగాణ కార్యక్రమం ద్వారా క్రీడా రంగంలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో రాష్ట్ర క్రీడా రంగానికి రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు నిధులు సాధించే దిశగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

ఖేలో ఇండియా నిర్వహణలో ప్రముఖ క్రీడాకారులు, మాజీ అంతర్జాతీయ క్రీడాకారుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రతి క్రీడా వేదికను ప్రముఖ క్రీడాకారులు దత్తత తీసుకుని, అక్కడి ఏర్పాట్లు, నిర్వహణను నిరంతరం పర్యవేక్షించేలా బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.

క్రీడాకారుల నుంచి వచ్చే సూచనలు, సలహాలను స్వీకరించి వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. క్రీడా రంగ అభివృద్ధిలో క్రీడాకారుల అనుభవం, అభిప్రాయాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.

డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో క్రీడా పండుగ వాతావరణం నెలకొంటుందని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా వేలాది మంది క్రీడాకారులు రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో వారికి అత్యుత్తమ ఆతిథ్యం, నాణ్యమైన వసతులు, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, గురుకుల విద్యాసంస్థల విద్యార్థులను పెద్ద సంఖ్యలో క్రీడా పోటీలకు తీసుకువచ్చి వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తామని చెప్పారు. యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంచడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు ఖేలో ఇండియా మంచి వేదికగా నిలుస్తుందన్నారు.

ALSO READ : నాగార్జున సాగర్‌కు ఏపీ సొరంగం.. 

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించడం ద్వారా తెలంగాణకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే కాకుండా, రాష్ట్రాన్ని భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు.