టఫ్  మ్యాన్ , గ్రేట్ లీడర్..మోదీపై ట్రంప్ ప్రశంసలు

టఫ్  మ్యాన్ , గ్రేట్ లీడర్..మోదీపై ట్రంప్ ప్రశంసలు

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, ఇరాన్‌ యుద్ధం వల్ల ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భద్రత, ఆర్థిక సహకారంపై చర్చించేందుకు క్వాడ్‌ (QUAD) దేశాల నేతలు సమావేశమయ్యారు. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో మంగళవారం జరిగిన ఆసియాన్‌ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ  టఫ్ మ్యాన్ (Tough Guy) , గొప్ప నేత, నాకు మంచి మిత్రుడు అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు గౌరవం ఉందని వ్యాఖ్యానించారు.

క్వాడ్‌ నేతలతో కలిసి గ్రూప్‌ ఫొటోకు దిగుతున్న సమయంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. జపాన్‌ ప్రధాని సనే తకైచీని సైతం ప్రస్తావిస్తూ.. ఆమె ఇంకా గట్టి నాయకురాలు కావచ్చని సరదాగా అన్నారు. క్వాడ్‌ సభ్య దేశాల నేతలందరితో తనకు మంచి సంబంధాలున్నాయని, వారంతా తన స్నేహితులని, అద్భుతమైన వ్యక్తులని ట్రంప్‌ అన్నారు.

అనంతరం జరిగిన సమావేశంలో క్వాడ్‌ దేశాల మధ్య పెరుగుతున్న సహకారాన్ని ట్రంప్‌ ప్రస్తావించారు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన భాగస్వామ్యాల్లో క్వాడ్‌ ఒకటని అన్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం స్వేచ్ఛగా, బహిరంగంగా, స్థిరంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

మా నాలుగు దేశాలు స్వేచ్ఛాయుత, బహిరంగ, స్థిరమైన, అత్యంత సుసంపన్నమైన ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికి నాలుగు మూలస్తంభాలుగా ఉన్నాయి. ప్రాంతీయ భద్రత, ఆర్థిక దౌత్యానికి సంబంధించిన అంశాల్లో మాకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. పరస్పరం సన్నిహితంగా సమన్వయం చేసుకుంటున్నాం” అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

ఈ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. క్వాడ్‌ ఒక నిర్మాణాత్మకమైన, విశ్వసనీయమైన భాగస్వామ్యమని అభివర్ణించారు. సముద్ర భద్రత, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలు వంటి కీలక అంశాల్లో ఈ కూటమి ఎప్పుడూ విశ్వసనీయ పరిష్కారాలను అందిస్తోందని తెలిపారు. క్వాడ్‌ దేశాల మధ్య తరతరాలుగా ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.

2007లో తొలిసారిగా నాలుగు దేశాల అధికారులు ఇక్కడే సమావేశమయ్యారు. పదేళ్ల తర్వాత, 2017లో ఇదే నగరంలో మన చర్చలను తిరిగి ప్రారంభించాం. ఇప్పుడు మరోసారి ఈ చారిత్రక నగరంలో క్వాడ్‌ సమావేశం జరగడం ఒక ముఖ్యమైన మైలురాయి. గత ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు మన విదేశాంగ మంత్రులు ఐదుసార్లు సమావేశమయ్యారు. ఇది మన రాజకీయ సంకల్పానికి, భాగస్వామ్యంపై ఉన్న ఉమ్మడి నిబద్ధతకు నిదర్శనం అని మోదీ అన్నారు.

క్వాడ్‌ కూటమిలో భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భద్రత, ఆర్థిక సహకారం, సముద్ర మార్గాల రక్షణ, విపత్తుల నిర్వహణ వంటి అంశాలపై ఈ దేశాలు పరస్పరం సమన్వయంతో పనిచేస్తున్నాయి.