హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తుల భవనాల్లో లిఫ్టులు, ఎలివేటర్ల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి 8 వారాల్లో బిల్లు రూపొందించి క్యాబినెట్ ఆమోదానికి పంపాలని స్పష్టం చేసింది. లిఫ్టుల నిర్వహణలో భద్రతా నిబంధనలు పాటించకపోవడంతో ప్రమాదాలు జరిగి పిల్లలు, పెద్దలు ప్రాణాలు కోల్పోతున్నారని రాజేంద్రనగర్‌కు చెందిన న్యాయవాది బర్కత్ అలీఖాన్ రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా స్వీకరించింది.
దీనిపై యాక్టింగ్ చీఫ్ జస్టిస్ పి. శ్యామ్ కోశి, జస్టిస్ ఎస్. చలపతిరావులతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. గతంలో కోర్టు ఆదేశాల మేరకు లిఫ్టుల భద్రతకు సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలు, నిబంధనలను ప్రభుత్వానికి పంపినా బిల్లు రూపకల్పనలో జాప్యం జరుగుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. సంబంధిత ఫైలు శాఖల పరిశీలనలో ఉందన్నారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. పిటిషనర్ ఇచ్చిన సూచనలు, మార్గదర్శకాలను పరిశీలించి బిల్లులో చేర్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 28కి వాయిదా వేసింది.
