- ఉత్పత్తి, రక్షణ, ప్రమాదాల నివారణ, పర్యావరణం కోసం చేపడుతున్న చర్యల పరిశీలన
కోల్‌బెల్ట్/ నస్పూర్, వెలుగు: సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ కోల్ పరిధిలోని కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ బొగ్గు గనుల ఎంపిక ప్రక్రియలో భాగంగా మంగళవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-5 అండర్‌గ్రౌండ్ బొగ్గు గనిని ఫైవ్ స్టార్ రేటింగ్ ఎవాల్యుయేషన్ అండ్ ఇన్‌స్పెక్షన్ కమిటీ తనిఖీ చేసింది.
ఫైవ్ స్టార్ రేటింగ్ కోసం గని యాజమాన్యం సమర్పించిన సేఫ్టీ, ప్రొడక్షన్, టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్తదితర ఏడు అంశాలకు సంబంధించిన రిపోర్టులను కమిటీ సభ్యులు శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. 2025-–26 సంవత్సరానికి దేశవ్యాప్తంగా టాప్-10 పర్సంటేజీలో షార్ట్‌లిస్ట్ అయిన గనుల్లో శ్రీరాంపూర్ ఏరియా నుంచి ఆర్కే-5, ఆర్కే న్యూటెక్, ఎస్ఆర్పీ-1 గనులు ఉన్నాయి.
ఈ సందర్భంగా జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ రక్షణ విషయంలో సింగరేణిలో శ్రీరాంపూర్ ఏరియా అగ్రగామిగా నిలుస్తోందన్నారు. 2024–-25లో ఆర్కే న్యూటెక్, ఆర్కే-6 అండర్‌గ్రౌండ్ గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించి జాతీయ స్థాయిలో సింగరేణి ఖ్యాతిని చాటాయని తెలిపారు. ఈసారి ఇన్‌స్పెక్షన్ కి ఎంపికైన మూడు గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించి హ్యాట్రిక్ నమోదు చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతకుముందు కమిటీ సభ్యులకు గని ఉద్యోగులు, కార్మికులు, ఆఫీసర్లు ఘనస్వాగతం పలికారు. గని ఆవరణలోని మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బి.ఎన్. పండిట్, పి.మోహన్ రావు, పి.శ్రీధర్, ఏ.కృష్ణ మోహన్ రావు, కె.రఘు కుమార్, గని మేనేజర్ సుధీర్ కుమార్ ఝా, ఆఫీసర్లు, లీడర్లు పాల్గొన్నారు.
