- మోదీ టఫ్ గాయ్.. ఆమె ఇంకా టఫ్ కావొచ్చు ..జపాన్ ప్రధానిపై ట్రంప్ చమత్కారం
- మోదీ టఫ్ గాయ్ ..ప్రధానిపై అమెరికా అధ్యక్షుడు
- ట్రంప్ ప్రశంసల వర్షం
- ఆమె ఇంకా టఫ్ కావొచ్చు అంటూ జపాన్ ప్రధానిపై చమత్కారం
- మనీలాలో క్వాడ్ సదస్సు.. నాలుగు కీలక నిర్ణయాలు
- ఫొటో దిగాక జెండా తీసుకున్న మోదీ.. దాచుకోండన్న ట్రంప్
- క్వాడ్ దేశాలు భారత్‌కు
- నమ్మకమైన భాగస్వాములు: మోదీ
మనీలా:ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ ‘వెరీ టఫ్ గాయ్’ అని, తనకు మంచి ఫ్రెండ్ అని అన్నారు. మోదీ గొప్ప నాయకుడని, ప్రపంచమంతా ఆయనను ఎంతో గౌరవిస్తుందని చెప్పారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో మంగళవారం క్వాడ్ దేశాధినేతల సదస్సు జరిగింది.
ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని సనే తకాయిచి, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి గ్రూప్ ఫొటో దిగిన తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడారు. పక్కనే ఉన్న మోదీని చూపిస్తూ ‘ఈయన వెరీ టఫ్ గాయ్’ అన్నారు. వెంటనే జపాన్ ప్రధాని తకాయిచి వైపు చూపిస్తూ ‘ఈమె ఇంకా టఫ్ కావొచ్చు’ అంటూ నవ్వించారు. ‘ఈ దేశాలతో మాకు మొదటి నుంచీ మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ ముగ్గురూ నాకు చాలాకాలంగా తెలుసు. అసాధారణ వ్యక్తులు, నాకు మంచి ఫ్రెండ్స్’ అని ట్రంప్ చెప్పారు.
క్వాడ్‌లో నాలుగు కీలక నిర్ణయాలు
మనీలా సదస్సులో 4 కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. క్వాడ్ బిజినెస్ లీడర్స్ ఫోరం, సూపర్ ఇంటెలిజెన్స్ యాక్సిలరేటర్, మారిటైమ్ (సముద్ర) ఇంటెలిజెన్స్ షేరింగ్, సైబర్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ షేరింగ్ ఇందులో ఉన్నాయి. బిజినెస్, టెక్నాలజీ రంగాల్లో సహకారం పెంచడం, నిఘా సమాచారాన్ని ఒకరితో ఒకరు పంచుకునే వ్యవస్థలను బలోపేతం చేయడంపై నేతలు దృష్టి పెట్టారు.
జెండా తీసుకున్న మోదీ
గ్రూప్ ఫొటో సమయంలో మోదీ జాతీయ జెండాకు ఇచ్చిన గౌరవం అందరినీ ఆకట్టుకుంది. ఫొటో కోసం నేలపై పెట్టిన భారత జెండా గుర్తును మోదీ స్వయంగా తీసుకున్నారు. అది చూసిన ట్రంప్ ‘దాన్ని భద్రంగా దాచుకోండి’ అన్నారు.
క్వాడ్ మాకు నమ్మకమైన భాగస్వామి: మోదీ
భారత్‌కు క్వాడ్ నమ్మకమైన భాగస్వామి అని ప్రధాని మోదీ అన్నారు. క్వాడ్‌కు మనీలాతో ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేశారు. 2017లో ఆగిపోయిన క్వాడ్ చర్చలు మళ్లీ మొదలైంది ఇదే నగరంలోనని, ఇప్పుడు మళ్లీ ఇక్కడే కలవడం ఒక మైలురాయి అని చెప్పారు. సముద్ర భద్రత, సప్లై చెయిన్లు, కొత్త టెక్నాలజీలు, విపత్తుల నిర్వహణలో క్వాడ్ దేశాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు.
రాబోయే రోజుల్లో సహకారానికి నాలుగు దేశాలు స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకోవాలని సూచించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రతకు క్వాడ్ కీలకమని నేతలు అభిప్రాయపడ్డారు.
ఆసియాన్ కేంద్రంగా ఉండాలె
అంతకుముందు మనీలాలోనే జరిగిన ఈస్ట్ ఆసియా సమ్మిట్‌లో మోదీ మాట్లాడారు. శాంతియుత, స్థిరమైన, సంపన్నమైన ఇండో–పసిఫిక్ ప్రాంతమే భారత్ లక్ష్యమని చెప్పారు. ఏ ప్రాంతీయ వ్యవస్థకైనా 11 దేశాల ‘ఆసియాన్’ కూటమే కేంద్రంగా ఉండాలని అన్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లను చర్చలు, దౌత్యంతోనే పరిష్కరించుకోవాలని, ప్రాంతీయ సహకారం బలపడాలని పిలుపునిచ్చారు.
