న్యాయం చేయండి.. శాట్జ్‌ ప్రధాన కార్యాలయం ముందు కోచ్‎ల నిరసన

న్యాయం చేయండి.. శాట్జ్‌ ప్రధాన కార్యాలయం ముందు కోచ్‎ల నిరసన

హైదరాబాద్‌, వెలుగు: తెలంగాణలో క్రీడలకు సీఎం రేవంత్​ రెడ్డి భారీ బడ్జెట్‌ను కేటాయించినా వాటిని అధికారులు సరైన మార్గంలో ఖర్చు చేయకుండా దుర్వినియోగం చేస్తున్నారని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ (శాట్జ్‌) కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఎల్బీ స్టేడియంలోని శాట్జ్‌ ప్రధాన కార్యాలయం ముందు కోచ్‌లు శాంతియుత నిరసన తెలిపారు. 70 మంది కోచ్‌లు, 200ల మంది క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు. 

గ్రేడ్‌-3 కోచ్‌ల వేతనాలు అందుకోవాల్సిన తమకు సర్వీస్‌ నిబంధనలకు విరుద్ధంగా అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల ద్వారా రోజు కూలీ కంటే తక్కువ జీతాలు  ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని శాట్జ్‌ వీసీ-ఎండీ సోనీబాల దేవికి వినతిపత్రం సమర్పించారు. సాయ్‌, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధంగా అర్హత కలిగిన కోచ్‌లకు కనీస వేతనంగా రూ.45 వేలు ఇవ్వాలని, 2009 నుంచి పని చేస్తున్న వారికి అనుభవం ఆధారంగా జీతాలను పెంచాలని డిమాండ్‌ చేశారు.