ఓపీఎస్ కోసం మాస్ లీవ్ ..మేనిఫెస్టో డే రోజు సీపీఎస్ ఉద్యోగుల నిరసన

ఓపీఎస్ కోసం మాస్ లీవ్ ..మేనిఫెస్టో డే రోజు సీపీఎస్ ఉద్యోగుల నిరసన
  • 1.72 లక్షల మంది సెలవు పెట్టారన్న సీపీఎస్ఈయూ
  • ఇందిరాపార్క్ దగ్గర ధర్నా.. జిల్లాల్లో ధర్మదీక్షలు
  • స్కూళ్లు, ఆఫీసుల్లో పనులపై ఎఫెక్ట్

 హైదరాబాద్, వెలుగు: ఓల్డ్ పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు మాస్ లీవుతో నిరసన తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదలై మూడేండ్లు పూర్తయిన సందర్భంగా సీపీఎస్ఈయూ(కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ) పిలుపు మేరకు దాదాపు లక్షకు పైగా ఉద్యోగ, ఉపాధ్యాయులు సామూహిక సెలవు పెట్టినట్టు నేతలు తెలిపారు. 

మంగళవారం హైదరాబాద్‌‌‌‌లోని ఇందిరాపార్క్ వద్ద సీపీఎస్ ఉద్యోగులు ధర్నా నిర్వహించగా.. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్మదీక్షలు చేపట్టారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఓల్డ్ పింఛన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, టీచర్లు పెద్ద సంఖ్యలో సామూహిక సెలవుపై వెళ్లడంతో రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, గవర్నమెంట్ ఆఫీసుల్లో కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది.

మూడేండ్లు గడిచినా హామీ నెరవేరలేదు

ఇందిరాపార్కు వద్ద జరిగిన ధర్నాలో సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు జి. స్థితప్రజ్ఞ మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా 1.72 లక్షల మంది సీపీఎస్​ఉద్యోగులు సెలవు పెట్టి, నిరసనలో పాల్గొనట్టు చెప్పారు. 2023 ఎన్నికలకు ముందు వరంగల్, జడ్చర్ల సభల్లో రేవంత్ రెడ్డి సహా జాతీయ, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఓపీఎస్ అమలుపై స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తుచేశారు. నవంబర్ 17న మేనిఫెస్టోలో పొందుపరిచారని తెలిపారు. తమ ఓట్లతోనే 15 నియోజకవర్గాల్లో గెలుపోటములు ప్రభావితమై ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కానీ మూడేండ్లు గడిచినా హామీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

జూలై11న జనజాగరణ యాత్ర ద్వారా 80 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఏడుగురు మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చామని, ఆగస్టు 23న ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో నవంబర్ 17 లోపు నిర్ణయం తీసుకోవాలని తీర్మానించామని తెలిపారు. సీఎస్ హామీ ఇచ్చిన మూడు నెలల అధ్యయన కమిటీ ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడంతోనే ధర్మదీక్షలకు దిగాల్సి వచ్చిందన్నారు. సర్వీస్ బ్రేక్, వేతనాల నిలిపివేత అంటూ కొందరు అధికారులు భయపెట్టినా ఉద్యోగులు వెరవలేదన్నారు. 

లక్ష రూపాయల జీతం తీసుకుని రిటైరైన వారికి నెలకు కేవలం రూ.1,500 నుంచి రూ. 5,218 మాత్రమే పెన్షన్ వస్తోందని, హెల్త్ కార్డులు వర్తించక, డీఏ ఏరియర్స్ అందక కొందరు రిటైర్డ్ టీచర్లు దుకాణాల్లో, వాచ్‌‌‌‌మెన్లుగా పనిచేయాల్సిన దుర్భర పరిస్థితి నెలకొందని వాపోయారు. ఆర్థిక భారం అంటూ కొందరు అధికారులు ఇచ్చే తప్పుడు నివేదికలను పక్కనపెట్టి రాజస్తాన్, చత్తీస్‌‌‌‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ తరహాలో వెంటనే ఓపీఎస్ అమలు చేయాలన్నారు. ఉద్యోగుల పాలిట గొడ్డలిపెట్టుగా మారిన జీవో ఎంఎస్ నెం. 28ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

 షేర్ మార్కెట్‌‌‌‌లో రూ. 19 వేల కోట్లు: శ్రీకాంత్

సీపీఎస్ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. సీపీఎస్ విధానంతో ప్రతినెలా సుమారు రూ. 200 కోట్ల ప్రజాధనం షేర్ మార్కెట్‌‌‌‌లోకి తరలిపోతోందన్నారు. 2004 నుంచి 2026 వరకు రాష్ట్రానికి చెందిన దాదాపు రూ. 19 వేల కోట్ల నిధులు ఎన్పీఎస్ ట్రస్ట్ ద్వారా షేర్ మార్కెట్‌‌‌‌లో నిలిచి ఉన్నాయన్నారు. సీపీఎస్ రద్దు చేస్తే ఆ నిధులు తిరిగి రాష్ట్రానికి అందుబాటులోకి వచ్చి అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఉపయోగపడతాయని వివరించారు. 

సీపీఎస్ సమీక్ష కోసం ఏర్పాటు చేసే అధ్యయన కమిటీలో, రాష్ట్ర స్థాయి ఈహెచ్ఎస్  కమిటీలో సీపీఎస్ఈయూకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు పెండింగ్ డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని యూనియన్ నేతలు కోరారు.  తమ యూనియన్ ద్వారా సభ్యులకు రూ. లక్ష వెల్ఫేర్ ఇన్సూరెన్స్, ఈ ఏడాది రూ. 3 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నామని ఆయన  చెప్పారు. మూడేండ్లు గడిచినందున ప్రభుత్వం జాప్యం చేయకుండా తక్షణమే సీపీఎస్‌‌‌‌ను రద్దు చేయాలని హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల అధ్యక్షుడు నరేందర్ రావు, మల్లికార్జున్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ కోరారు.  

కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కోటకొండ పవన్, చింతల రాకేశ్ భవాని,రాష్ట్ర నేతలు రోషన్, శ్యామ్ సుందర్, కవిత శ్రీ, రావుఫ్,సామ శ్రీనివాస్,భాస్కర్ రావు, మహేష్ కుమార్, శివాజీ, చంద్ర శేఖర్, మోహన్ సింగ్, ధర్మేంధర్ తదితరులు పాల్గొన్నారు.