వెలుగు స్పెషల్ : అమెరికా, చైనా, రష్యా త్రైపాక్షిక సమావేశం సర్వత్రా ఉత్కంఠ!

వెలుగు స్పెషల్ : అమెరికా, చైనా, రష్యా త్రైపాక్షిక సమావేశం   సర్వత్రా ఉత్కంఠ!

చైనాలో 2026 నవంబర్ 19న అమెరికా, రష్యా, చైనాల మధ్య మొట్టమొదటి త్రైపాక్షిక సమావేశం జరగనుంది.  గురువారం జరిగే  ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మూడు దేశాల శిఖరాగ్ర సమావేశంపై  ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. అన్ని దేశాల ప్రభుత్వాలలోనూ ఆత్రుత నెలకొంది.  అమెరికా, చైనా, రష్యా దేశాల అధినేతలు డొనాల్డ్ ట్రంప్,  జిన్‌‌‌‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్  మొట్టమొదటిసారిగా చారిత్రాత్మక  త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. వాస్తవానికి  గత కొన్ని దశాబ్దాలలో గొప్ప త్రైపాక్షిక సమావేశం 1945 ఫిబ్రవరిలో రష్యాలోని యాల్టాలో జరిగింది.  ప్రపంచ భవిష్యత్తుపై చర్చించడానికి బ్రిటన్, అమెరికా, రష్యా  సమావేశమయ్యాయి. యాల్టా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అప్పటి ప్రపంచ రూపాన్ని చాలావరకు తీర్చిదిద్దాయి.  

ఆనాటి ముగ్గురు ప్రపంచ దిగ్గజాలు బ్రిటన్‌‌‌‌కు చెందిన విన్‌‌‌‌స్టన్ చర్చిల్, అమెరికా అధ్యక్షుడు రూజ్‌‌‌‌వెల్ట్, రష్యాకు చెందిన స్టాలిన్ యాల్టా సమావేశానికి హాజరయ్యారు. యాల్టాలో, యూరప్‌‌‌‌లో సగం రష్యా ప్రభావంలోకి రావాలని స్టాలిన్ డిమాండ్ చేయగా అమెరికా,  బ్రిటన్ ఆ డిమాండ్‌‌‌‌కు అంగీకరించాయి. యూరప్‌‌‌‌లో రష్యా ప్రభావంలో 7 కమ్యూనిస్ట్  దేశాలు ఉండేవి. అయితే ప్రస్తుతం జరగనున్న అమెరికా, చైనా, రష్యా  త్రైపాక్షిక  సమావేశంపై యూరప్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమ భాగ స్వామ్యం లేకుండానే తమ భవిష్యత్తును  నిర్ణయించే  అగ్రరాజ్యాల  సమావేశం నుంచి తమను మినహాయించారని యూరప్ తీవ్రంగా కలత చెందుతోంది.

అమెరికా, చైనా, రష్యా శక్తిమంతమైన దేశాలా?

ఆర్థికపరంగా చూస్తే అమెరికా, రష్యా,  చైనాల ఉమ్మడి జీడీపీ 54 ట్రిలియన్ డాలర్లు.  ఇది ప్రపంచ మొత్తం జీడీపీలో 46% వాటాను కలిగి ఉంది. మరోవైపు భారతదేశ జీడీపీ సుమారు 4 ట్రిలియన్ డాలర్లు మాత్రమే. ఆయుధపరంగా చూస్తే  ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం 12,000 అణ్వాయుధాలలో.. అమెరికా, రష్యా, చైనా ఈ మూడు దేశాలు కలిసి మొత్తం11,200 అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. 

ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే  సైనికంగా, ఆర్థికంగా ఈ మూడు అగ్ర దేశాలు  ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాలుగా ఉన్నాయి. ఈ మూడు దేశాల అధినేతలు కూడా ప్రపంచ దేశాలపై ప్రభావం చూపే బలమైన వ్యక్తి త్వాలను కలిగి ఉండటంతోపాటు నిరంకుశ ప్రవర్తనతోనూ ప్రపంచ ప్రసిద్ధి పొందారంటే అతిశయోక్తి కాదు. 

1945 యాల్టా మీటింగ్‌‌‌‌  2026 చైనా సమావేశానికి మధ్య వ్యత్యాసం

1945 యాల్టా మీటింగ్‌‌‌‌ నాటికి  ప్రపంచంలో  బ్రిటన్‌‌‌‌ అత్యంత  శక్తిమంతమైన  దేశంగా ఉన్నందున ఆ సమావేశంలో బ్రిటన్ కీలకపాత్ర పోషించింది. అయితే 2026 నవంబర్ 19న చైనాలో జరగబోయే  త్రైపాక్షిక సమావేశానికి బ్రిటన్‌‌‌‌ను మినహాయించగా  చైనా చేరింది.  బ్రిటన్‌‌‌‌తోపాటు యూరప్‌‌‌‌ దేశాలలో దేనికీ ఆహ్వానం అందకపోవడంతో వాటి స్థాయి తగ్గిపోయిందని సూచిస్తూ  బ్రిటన్, యూరప్‌‌‌‌ను  నిర్లక్ష్యం చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.  ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,  చైనా అధ్యక్షుడు  జిన్‌‌‌‌పింగ్,  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్  పుతిన్  ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన అగ్ర నాయకులలో  ముగ్గురుగా  ప్రధానస్థానంలో ఉన్నారు.

త్రైపాక్షిక సమావేశం ప్రయోజనాలు

ప్రపంచ దేశాలను  ప్రభావం చేసే మూడు అత్యంత శక్తిమంతమైన దేశాల త్రైపాక్షిక సమావేశం అంటే  ఆ గొప్ప శక్తులు తమ దేశాల దీర్ఘకాల ప్రయోజనాల కోసం చర్చించుకుంటాయని అర్థం.  వారి స్వప్రయోజనాలతోపాటు ఈ సమావేశం  ప్రపంచవ్యాప్తంగా  నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి,  ఆయా దేశాల మధ్య జరుగుతున్న సంఘర్షణలపై అనధికారిక అవగాహన ఒప్పందాలను సృష్టించగలదు.  అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలలో ఓటమి తర్వాత  డొనాల్డ్ ట్రంప్ ఈ త్రైపాక్షిక సమావేశం ద్వారా తిరిగి రాజకీయంగా పుంజుకుంటారు.  

నిరంకుశ దేశాలైన  రష్యా,  చైనాలతో మాట్లాడి కొరియా, ఇరాన్, ఉక్రెయిన్‌‌‌‌లలో ఉద్రిక్తతలను తగ్గించగలిగే మార్గాలను అన్వేషించడానికి  ట్రంప్ ఆసక్తి చూపుతారని  ప్రపంచంలో చాలా దేశాలు ఈ సమావేశాన్ని స్వాగతిస్తున్నాయి. ఈ త్రైపాక్షిక సమావేశం ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించలేకపోయినా,  చిన్న సమస్యలను పరిష్కరించి ఆయా దేశాల మధ్య  మరింత ఐక్యతను సృష్టించే అవకాశం ఉంది.  ఐక్యరాజ్యసమితి,  ఇతర అంతర్జాతీయ సంస్థలు అంతకంతకూ ప్రపంచ దేశాల సమస్యలను పరిష్కరించడంలో విఫలమై అసమర్థంగా మారుతున్నాయి. ఈనేపథ్యంలో  ఉద్రిక్తతలను పరిష్కరించడానికి ప్రపంచానికి కొత్త యంత్రాంగాలు అవసరం. వాస్తవానికి ఐక్యరాజ్యసమితిలో జరిగే బహిరంగ చర్చల కంటే అనధికారిక సమావేశాలు తరచుగా సమస్యలను మెరుగ్గా పరిష్కరిస్తాయి.  

యుద్ధ ఉద్రిక్తతలపై చర్చ

అమెరికా, రష్యా, చైనా.. ఈ మూడు దేశాల కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా ట్రంప్  అమెరికాకు,  ప్రపంచానికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ ముగ్గురు అగ్రదేశాల అధినేతలు  అమెరికా, రష్యా, చైనాల మధ్య చర్చలను కొనసాగించి ఉమ్మడి అభిప్రాయాలను వ్యక్తం చేయగలరు.  2026 నవంబర్ 19న  చైనాలోని షెన్‌‌‌‌జెన్‌‌‌‌లో  మూడు దేశాల త్రైపాక్షిక సమావేశం సజావుగా జరిగితే ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా–-ఇరాన్ యుద్ధం.  

ఉత్తర–దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలపై కచ్చితంగా చర్చ జరుగుతుంది. పరిష్కార దిశగా మెరుగైన నిర్ణయాలు వెలువడవచ్చు. ఇతర రెండు అగ్రరాజ్యాల అభ్యర్థన మేరకు రష్యా ఉక్రెయిన్‌‌‌‌తో యుద్ధాన్ని ఆపగలదు.  ఇరాన్ యుద్ధాన్ని ఆపడంలో  చైనా కూడా సహాయపడగలదు. అన్ని దౌత్య సమావేశాలకు ఆశించిన మేరకు విలువ ఉంటుంది.  ప్రపంచ సంక్షోభాలను పరిష్కరించడంలో చైనా అధినేత జిన్‌‌‌‌పింగ్‌‌‌‌ను భాగస్వామిని చేయడానికి ఈ త్రైపాక్షిక కూటమి ట్రంప్‌‌‌‌కు ఒక అవకాశాన్ని ఇస్తుంది. చైనా ఇప్పటివరకు అంతర్జాతీయ యుద్ధాలకు దూరంగా ఉంది. చైనా భారతదేశానికి శత్రువుగా ఉన్నప్పటికీ ఒక అగ్రరాజ్యంగా  ప్రపంచ శాంతికి దాని ప్రమేయం కూడా కచ్చితంగా అవసరం.  

 అగ్రరాజ్యాలకు కూడా శాంతి అవసరం

రష్యా క్రమంగా ఒక క్షీణిస్తున్న శక్తి.  కానీ ప్రస్తుతం అది గణనీయమైన ఆర్థిక, సైనిక బలాన్ని కలిగి ఉంది. భవిష్యత్తులో  నేడు బ్రిటన్, ఐరోపా దేశాలను పక్కకు నెట్టినట్లే  రష్యాను కూడా అమెరికా, చైనా బహుశా పక్కకు నెట్టవచ్చు.  ఇరాన్ యుద్ధాన్ని పరిష్కరించడంలో  రష్యా, చైనా సహాయపడితే అమెరికాకు ఎదురయ్యే ఒక ప్రమాదకరమైన పరిస్థితి నుంచి ట్రంప్ తప్పించగలరు.  ఈ మూడు దేశాలకు వాటి సొంత అంతర్జాతీయ సమస్యలు ఉన్నాయి.  రష్యాకు ఉక్రెయిన్, అమెరికాకు ఇరాన్,  చైనాకు  తైవాన్, దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు ఉన్నాయి.  అగ్రరాజ్యాలకు కూడా శాంతి అవసరం.  ఈ త్రైపాక్షిక సమావేశం ఆయుధ నియంత్రణ,  ప్రపంచ అణు నిరాయుధీకరణపై చర్చలను ప్రారంభించవచ్చు. అణువ్యాప్తిని, అణు యుద్ధ ప్రమాదాన్ని నియంత్రించడానికి ప్రపంచానికి తక్షణ చర్యలు అవసరం.

భారత్​కు భయం లేదు

ఈ సమావేశం తర్వాత చైనా  ప్రపంచంలోనే  అతి శక్తిమంతమవుతుందా  అన్నదే ప్రశ్న.  చైనా ఇప్పటికే ఒక అగ్రరాజ్యం.  ప్రపంచవ్యాప్తంగా జరిగే శాంతి చర్చలలో చైనాను భాగస్వామిని చేయడం ద్వారా, దానిని మరింత బాధ్యతాయుతమైన శక్తిగా మారేలా ఈ   త్రైపాక్షిక సమావేశం ప్రోత్సహించవచ్చు.  1945లో జరిగిన యాల్టా త్రైపాక్షిక సమావేశం యుద్ధప్రభావం నుంచి ప్రపంచాన్ని తీర్చిదిద్దడంలో సహాయపడింది. అమెరికా, రష్యా, చైనాల తొలి త్రైపాక్షిక సమావేశంలో ఏం జరుగుతుందో  వేచిచూడాలి.  

2600 సంవత్సరాల క్రితం ప్రాచీన గ్రీకు తత్వవేత్త హెరాక్లిటస్ చెప్పినట్లుగా ‘మార్పు ఒక్కటే శాశ్వతం’ అనడంలో సందేహం లేదు.  భారతదేశం మార్పుకు భయపడనవసరం లేదు. కానీ దాని కోసం  ప్రణాళిక వేసుకోవాలి.  డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం ప్రపంచంతోపాటు  భారతదేశం కూడా ఎల్లప్పుడూ ఆశ్చర్యాలకు సిద్ధంగా ఉండాలి. ఈ త్రైపాక్షిక సమావేశం విజయవంతం కావచ్చు లేదా విఫలమూ కావచ్చు. వేచిచూద్దాం! 

భారత్​కు ప్రయోజనం ఏమిటి?

ఈ  త్రైపాక్షిక సమావేశం వల్ల భారతదేశానికి కూడా కీలకమైన  ప్రయోజనాలు ఉన్నాయి.  భారతదేశం ఒక అగ్రరాజ్యంగా ఇంకా గుర్తింపు పొందలేదు. కానీ భారతదేశాన్ని ఒక శక్తిమంతమైన దేశంగా ప్రపంచ దేశాలు పరిగణిస్తున్నాయి.  చైనా భారతదేశానికి నిరంతర శత్రువుగా ఉన్నంతకాలం మనం దానితో అప్రమత్తంగా ఉండాల్సిందే.  ఈ త్రైపాక్షిక సమావేశం ఉక్రెయిన్,  ఇరాన్ యుద్ధాలను ముగించడంలో సహాయపడితే, అది భారతదేశానికి తక్షణ ప్రయోజనం చేకూరుస్తుంది. చమురు ధరలు కనిష్ట స్థాయికి పడిపోవచ్చు, ఇది భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊపునిస్తుంది.  ప్రస్తుతం భారతదేశానికి లభించే అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఇదే.  


- డా. పెంటపాటి పుల్లారావు
పొలిటికల్ ఎనలిస్ట్​