పంచాయతీలకు రూ.1,129 కోట్లు కట్.. కారణాలు ఇవే..!

 పంచాయతీలకు రూ.1,129 కోట్లు కట్.. కారణాలు ఇవే..!
  • ఇందులో రూ.729.41 కోట్ల జీపీ, రూ.400 కోట్ల జడ్పీ, మండల పరిషత్ నిధులు
  • గడువు ముగియడం, ఎన్నికల జాప్యం, యూసీల సమర్పణ సరిగా లేకపోవడమే కారణమంటున్న అధికార వర్గాలు
  • 16వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై ఎఫెక్ట్ 
  • మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి

హైదరాబాద్, వెలుగు: 15వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు రావాల్సిన పెండింగ్ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం బ్రేక్ వేసింది. 2021–26 కింద రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు రావాల్సిన రూ.1,129 కోట్ల పెండింగ్ నిధులను ఇకపై విడుదల చేయలేమని స్పష్టం చేసింది. 2026 మార్చి 31తో 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగియడం, కొత్తగా 16వ ఆర్థిక సంఘం పీరియడ్ ప్రారంభం కావడంతో పాత బకాయిలను ఇవ్వమని తేల్చిచెప్పినట్లు సమాచారం.

నిర్ణీత గడువులోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం, ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన  వినియోగ ధ్రువీకరణ పత్రాలు (యూసీ), ఇతర సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఇంకా పెండింగ్​బకాయి నిధులు ఇవ్వలేమని పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో మన రాష్ట్రంతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో పెండింగ్ నిధులను కోల్పోయే పరిస్థితి తలెత్తింది.

కారణాలు ఇవే..!
గ్రామ పంచాయతీలకు రావాల్సిన రూ.729.41 కోట్లు, మండల పరిషత్ (ఎంపీటీసీ), జిల్లా పరిషత్తులకు (జడ్పీటీసీ) చెందిన రూ.400 కోట్ల బకాయిలు నిలిచిపోయాయి. జీపీలకు రావాల్సిన నిధులను పొందాలంటే గతంలో ఖర్చు చేసిన మొత్తానికి సంబంధించిన బిల్లులు, వినియోగ ధ్రువీకరణ పత్రాలను (యూసీలు) రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది. ఖర్చుల లెక్కలను సకాలంలో, సక్రమంగా ఇవ్వకపోవడంతోపాటు ఇతర సాంకేతిక కారణాలను చూపుతూ ఈ బకాయిల విడుదలను కేంద్రం ఆపేసింది.

మరో వైపు, 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఎంపీటీసీ, జడ్పీటీసీలకు రావాల్సిన రూ.400 కోట్ల నిధులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆర్థిక సంఘం గడువు ముగిసేలోపు ఆయా సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడమే నిధుల నిలిపివేతకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

నిధుల మళ్లింపు ఆరోపణలు
రాష్ట్రానికి విడుదలైన ఆర్థిక సంఘం నిధులను సక్రమంగా వినియోగించడం లేదని కేంద్ర మంత్రులు సైతం ఆరోపణలు చేశారు. గ్రామాల అభివృద్ధి పనులకు కాకుండా సిబ్బంది జీతాలు, కరెంట్ బిల్లుల చెల్లింపుల వంటి ఇతర అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను మళ్లిస్తోందని ఆరోపిస్తూ విచారణకు డిమాండ్ చేశారు. ఈ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు కూడా తదుపరి నిధుల విడుదలకు ప్రతిబంధకంగా మారాయని ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు.

ఇప్పటివరకు రూ.2,293 కోట్లు విడుదల 
15వ ఆర్థిక సంఘం కింద గ్రామ పంచాయతీలకు మొత్తం రూ.3,023.15 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు విడతలవారీగా రూ.2,293.75 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. సర్పంచ్ ఎన్నికలు ఆలస్యం కావడంతో గతంలో నిలిచిపోయిన నిధులను, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో కేంద్రం విడుదల చేసింది.

ఇందులో భాగంగా 2025–26 సంవత్సరానికి కేటాయించిన మొత్తం రూ.1,277 కోట్లలో మార్చి 31 నాటికి తొలి విడతగా టైడ్ గ్రాంట్ల కింద రూ.371.91 కోట్లు, అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైడ్ గ్రాంట్ల కింద రూ.247.94 కోట్లు కలిపి సుమారు రూ.619.85 కోట్లు మాత్రమే అందాయి. మిగిలిన నిధులపై ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది.

16వ ఆర్థిక సంఘం నిధులపై ప్రభావం
2026–31 మధ్య ఐదేండ్ల కాలానికి గాను 16వ ఆర్థిక సంఘం రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.9,968 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.11,548 కోట్లు కేటాయించింది. గ్రామీణ సంస్థలకు వచ్చే రూ.9,968 కోట్లలో గ్రామ పంచాయతీలకు 80 శాతం, మండల పరిషత్తులకు 10 శాతం, జిల్లా పరిషత్తులకు 10 శాతం చొప్పున వాటా నిర్ణయించగా, వీటిని రూ.7,974 కోట్ల బేసిక్ గ్రాంట్లు, రూ.1,994 కోట్ల పెర్ఫార్మెన్స్ గ్రాంట్లుగా విభజించింది.

15వ ఆర్థిక సంఘం పాత బకాయిలు, యూసీల సమర్పణ ప్రక్రియ ఒక కొలిక్కి రాకపోవడం కొత్తగా ప్రారంభమైన 16వ ఆర్థిక సంఘం తొలి విడత నిధుల విడుదలపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా కొత్త నిధుల రాకలోనూ జాప్యం జరిగే పరిస్థితి కనిపిస్తోంది.