మరో జన్మంటూ ఉంటే.. బిచ్చగాడిలా పుట్టించు దేవుడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న దంపతుల సూసైడ్ నోట్‌

మరో జన్మంటూ ఉంటే.. బిచ్చగాడిలా పుట్టించు దేవుడా..!  కన్నీళ్లు పెట్టిస్తున్న దంపతుల సూసైడ్ నోట్‌
  • మరో జన్మంటూ ఉంటే.. బిచ్చగాడిలా పుట్టించు..
  • వడ్డీ వేధింపులకు దంపతులు బలి
  • పెంపుడు కుక్కను చంపి.. ఆత్మహత్య
  • రూ.10 వేలకు వారానికి రూ.750.. నెలకు 30 శాతం మిత్తీ 
  • తోబుట్టువు అనుకొని అంత్యక్రియలు జరిపించండి సీఎం రేవంత్ సార్
  • ఇద్దరు కొడుకులున్నా అనాథలమేనంటూ లేఖ
  • గ్రేటర్ వరంగల్ రంగశాయిపేటలో విషాదం

వరంగల్‍/ఖిలా వరంగల్‍, వెలుగు: ''మరో జన్మంటూ ఉంటే బిచ్చగాడిలా పుట్టించు లేదంటే ఉన్నోడిలా పుట్టించు. అంతేతప్పితే ఈ మధ్యతరగతి బతుకువద్దు తల్లీ. అసలు ఈ మనిషి జన్మనే వద్దు పరమేశ్వరా. రూ.10 వేలు అప్పుతీసుకుంటే వారానికి రూ.750..నెలకు 30 శాతం మిత్తీ కడ్తున్నం. ఒక్క వారం లేటైతే ఇంటికి మనుషులను పంపి.. రోడ్డుమీదకు గుంజుతానని బెదిరిస్తున్నరు. తీసుకున్న అప్పును న్యాయంగా కట్టినోళ్లనే వడ్డీ వ్యాపారులు అందరిముందు దొంగల్లా నిలబెడుతున్నారు. మా బాధలు ఎవరికి చెప్పుకోలేక ముద్దుగా పెంచుకున్న కుక్కను కూడా మాతో తీసుకుని వెళ్లిపోతున్నాం” అంటూ సూసైడ్​నోట్​రాసి గ్రేటర్ వరంగల్ కు  చెందిన దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. 

వరంగల్‍ జిల్లా మిల్స్​కాలనీ పోలీసుల వివరాలు, సూసైడ్‍ నోట్ ప్రకారం గ్రేటర్‍ వరంగల్‍ పరిధి రంగశాయిపేటలో  నీలపోగుల సంజయ్‍ కుమార్‍ (60), శోభ (53)  అద్దె ఇంట్లో ఉంటున్నారు. సంజయ్‍ డ్రైవర్‍గా పనిచేస్తుండగా వీరి ఇద్దరు కొడుకులు చదువులు, ఉద్యోగాలరీత్యా పూణెలో ఉంటున్నారు. కాగా, సొంతిల్లు, వాకిలి కూడా లేకపోవడం, కొడుకులు పెద్దగా పట్టించుకోకపోవడంతో  దంపతులు ఒంటరిగా ఫీల్‍ అయ్యారు. బీపీ, షుగర్‍, థైరాయిడ్‍ వంటి ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. వారు దివ్య చంద్రిక అనే మహిళ వద్ద రూ.50 వేలు అప్పు  తీసుకున్నారు.  

రూ.10 వేలకు వారానికి రూ.750 చొప్పున నెలకు దాదాపు రూ.3 వేల చొప్పున జబర్దస్తీగా వడ్డీ వసూలు చేసిందని, తాము 11 నెలలు వడ్డీ కట్టామని వాపోయారు. దాదాపు 30 పైసల  వడ్డీ కట్టలేనని దివ్య కాళ్లు పట్టుకుని బతిమిలాడినా ఆమె  తీరు మారకపోగా.. వడ్డీ కోసం వారి ఇంటికి మనుషులను పంపించి పరువు తీస్తానంటూ బెదిరించింది. దీంతో వడ్డీ కట్టడానికి చేతిలో డబ్బుల్లేక మానసికంగా కుంగిపోయిన సంజయ్‍ కుమార్‍ ఆత్మహత్యే శరణ్యమని భావించాడు.  

ఇదే విషయాన్ని భార్య శోభకు చెప్పగా ఆమె కూడా  చావుకు సిద్ధమైంది. దీంతో వారు ప్రేమగా పెంచుకునే కుక్కను మొదట చంపేసి.. ఆతర్వాత ఉరేసుకుని ఇద్దరు చనిపోయారు. కాగా, తమ చావుకు దివ్య చంద్రికనే కారణమని సూసైడ్‍ నోట్‍లో స్పష్టంగా పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కర్రె స్వామి వెల్లడించారు. పోస్ట్​మార్టం కోసం డెడ్​బాడీలను ఎంజీఎం మార్చురీకి తరలించారు.    

అంత్యక్రియలు జరిపించు సారూ

సంజయ్‍, శోభ దంపతులు ఆత్మహత్యకు ముందు సూసైడ్‍ నోట్​ రాశారు. తమకు ఇల్లు, వాకిలి లేదని, సంజయ్‍ కుమార్‍ తండ్రి మరణించినప్పుడు సొంత ఇల్లులేక కాష్టాలగడ్డ (శ్మశాన వాటిక) వద్దనే ఉన్నామని,  ఆ సమయంలో తాము అనుభవించిన బాధ తమ పిల్లలు పడకూడదని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యబీమా పథకంలో తాను గతంలో ఆపరేషన్‍ చేసుకున్నానని, ఇప్పుడు కూడా తమను తోబుట్టువుగా భావించి అంత్యక్రియలు నిర్వహించాలని సంజయ్​ సీఎం రేవంత్‍రెడ్డిని  కోరారు. తమ ఇద్దరికి సంబంధించి ఏవైనా అవయవాలు ఇతరులకు పనికొస్తాయని భావిస్తే.. అవయవదానం చేయాలని కోరారు.