కోర్టు ధిక్కరణ కేసులో కోర్టుకు..కరీంనగర్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ హాజరు

కోర్టు ధిక్కరణ కేసులో కోర్టుకు..కరీంనగర్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ హాజరు
  • విచారణకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ద్వారా అటెండ్‌‌‌‌ 
  • తీర్పు వాయిదా వేసిన హైకోర్టు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: పట్టాదారు భూమిని బతుకమ్మ ఉత్సవాలు, గణేశ్‌‌‌‌ నిమజ్జనాలకు వినియోగించడంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయలేదన్న కోర్టు ధిక్కరణ కేసులో కరీంనగర్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ చిత్రా మిశ్రా మంగళవారం హైకోర్టుకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో హాజరయ్యారు. కొత్తపల్లి మండలం సర్వే నంబర్‌‌‌‌ 626/ఎ/1లోని 33 గుంటల పట్టా భూమిలో కంకర పోసి, లైట్లు ఏర్పాటు చేయడంతోపాటు చెట్లను తొలగించి వ్యవసాయానికి పనికిరాకుండా చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ప్రత్యామ్నాయంగా సర్వే నంబర్‌‌‌‌ 127లో ఎకరం భూమి ఇస్తామని అధికారులు హామీ ఇచ్చినా అమలు చేయలేదన్నారు. ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని, లేదంటే భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు. అయినా అధికారులు చర్యలు తీసుకోలేదని తెలిపారు.ఈ నేపథ్యంలో బండ కృష్ణారెడ్డితో పాటు మరో ఇద్దరు కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌‌‌ వేశారు. విచారణ సందర్భంగా జస్టిస్‌‌‌‌ సీవీ భాస్కర్‌‌‌‌రెడ్డి అధికారులను ప్రశ్నించారు.

భూమిని ప్రజా అవసరాలకు వినియోగించకపోతే పట్టాదారుకు నోటీసులు ఎందుకు ఇచ్చారని నిలదీశారు. కలెక్టర్‌‌‌‌ స్పందిస్తూ.. ఆ ప్రాంతం ప్రస్తుతం కరీంనగర్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌లో కలిసిందన్నారు. భూమిని గతంలో ఉన్న స్థితిలోనే పట్టాదారుకు అప్పగిస్తామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.