హైదరాబాద్ మహానగరం అంతా..  ప్రకటనల దందా ! ఎక్కడ చూసినా అక్రమ బస్‌ షెల్టర్లు, ఇల్లీగల్ డిజిటల్ బోర్డులు

హైదరాబాద్ మహానగరం అంతా..  ప్రకటనల దందా ! ఎక్కడ చూసినా అక్రమ బస్‌ షెల్టర్లు, ఇల్లీగల్ డిజిటల్ బోర్డులు
  • అవసరం లేని చోట్ల ట్రాఫిక్ అంబ్రెల్లాలపై యాడ్స్
  • 99 శాతం డిజిటల్ బోర్డులకు అనుమతుల్లేవ్
  • లెక్క తేల్చే పనిలో జీహెచ్ఎంసీ
  • యాడ్ ఏజెన్సీలతో ఆఫీసర్లు, సిబ్బంది కుమ్మక్కు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ మహా నగరంలో అక్రమ అడ్వర్టైజ్ మెంట్ దందా కొనసాగుతోంది. సిటీలో ఎక్కడ చూసినా అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన డిజిటల్‌ బోర్డులు, బస్‌ షెల్టర్లు, ట్రాఫిక్‌ అంబ్రెల్లాలే కనిపిస్తున్నాయి. వీటితో ఏజెన్సీలు నెలకు దాదాపు రూ. కోట్లు కూడబెడుతుండగా...అధికారులకు కూడా వాటాలు ముడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం మూడు కార్పొరేషన్లలో కలిపి దాదాపు 1500 వరకు బస్ షెల్టర్లు, 800లోపు ట్రాఫిక్‌ అంబ్రెల్లాలకు పర్మిషన్​ ఉంది.

బస్​షెల్టర్లు, ట్రాఫిక్​అంబ్రెల్లాలపై ఏర్పాటు చేసే యాడ్స్​వల్ల ఏజెన్సీలు ఆదాయం సంపాదించుకుంటాయి. అయితే, అవసరం లేని చోట పర్మిషన్​లేకుండా ఇష్టారీతిన బస్​షెల్టర్లు, ట్రాఫిక్​అంబ్రెల్లాలు ఏర్పాటు చేస్తున్న ఏజెన్సీలు ప్రకటనలు ఏర్పాటు చేసి దండుకుంటున్నాయి. ఇక డిజిటల్ బోర్డులకు కేబీఆర్​పార్కు వద్ద  కాకుండా ఎక్కడా అనుమతి లేదు. అయితే, సిటీలో 99 శాతం డిజిటల్​బోర్డులు అక్రమంగా ఏర్పాటు చేసినవే.

షాపింగ్ మాల్స్, గోల్డ్ షాప్ లు, షోరూమ్స్ ఇలా చాలా షాపింగ్​కాంప్లెక్స్​ల ఎదుట ఎక్కడ చూసినా ఈ డిజిటల్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఈ విషయం జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు తెలియడంతో అనుమతులు ఉన్నవి ఎన్ని? ఏర్పాటు చేసినవి ఎన్ని ? అనే లెక్కలు తేల్చడానికి విజిలెన్స్ ​విభాగాన్ని రంగంలోకి దించారు. వీరు ఫీల్డ్​లెవెల్​లోకి ఎంటరై రికార్డులకు, ఏర్పాటు చేసిన వాటిని పరిశీలిస్తున్నారు. ఈ లెక్కలకు అస్సలు పొంతన కుదరక ముక్కున వేలేసుకుంటున్నారు.

పనిలో పనిగా 60 డిజిటల్ బోర్డులను తొలగించారు. అయితే, సీఎంసీ, ఎంఎంసీలో మాత్రం డిజిటల్​బోర్డులపై ఎలాంటి యాక్షన్​తీసుకోవడం లేదు. ఇవే కాకుండా నగరంలో ఎన్ని బస్‌ షెల్టర్లకు అనుమతులున్నాయి? ఎన్ని ట్రాఫిక్‌ అంబ్రెల్లాలకు అధికారిక అనుమతులు తీసుకున్నారు? అనే వివరాలను సేకరిస్తున్నారు. యాడ్ ఏజెన్సీలను కూడా విచారిస్తున్నారు.  

రాత్రికి రాత్రే బస్ షెల్టర్లు ప్రత్యక్ష్యం
మూడు కార్పొరేషన్ల పరిధిలో రాత్రికి రాత్రే చాలా చోట్ల బస్ షెల్టర్లు ప్రత్యక్షం అవుతున్నాయి. అసలు బస్సులు ఆగని చోట్ల కూడా ప్రకటనల కోసం బస్టాప్​లను ఏర్పాటు చేస్తున్నారు. ఉదాహరణకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో పంజాగుట్టవైపు వెళ్లే రూట్ లో తాజ్ బంజారా హోటల్ ఫుట్ పాత్ పై రాత్రికి రాత్రి బస్​షెల్టర్ ఏర్పాటు చేశారు. అసలు ఇక్కడ స్టాప్ కూడా లేనప్పటికీ ఎందుకు ఏర్పాటు చేశారో క్లారిటీ లేదు. ముఖ్యమైన ప్రాంతాల్లో, అందరికీ తెలిసే ఏరియాల్లోనే ఇంత ధైర్యంగా ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడుతున్నాయంటే పెద్ద తలకాయల సపోర్టే ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

యాడ్‌ ఏజెన్సీలతో ములాఖత్​ 
అడ్వర్టైజ్ మెంట్ అనుమతుల వ్యవహారంలో కొందరు అధికారులు, యాడ్‌ ఏజెన్సీలు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూల్స్​ పక్కన పెట్టి పర్మిషన్లు ఇవ్వడంలో, అనుమతుల్లేకుండాwనే ప్రకటనల ఏర్పాటుకు సహకరించడంలో, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండికొట్టడంలో కొందరు ఆఫీసర్లు కీలకపాత్ర పోషిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే విజిలెన్స్​విచారణలో కొందరి పేర్లు బయటకు వచ్చినట్టు సమాచారం.  విచారణ పూర్తయ్యాక బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.