శ్రీశైలం ఖాళీ.. సాగర్ కూ గండి!.. ఏపీ జల దోపిడీ పీక్స్

శ్రీశైలం ఖాళీ.. సాగర్ కూ గండి!.. ఏపీ జల దోపిడీ పీక్స్

హైదరాబాద్, వెలుగు: అటు కృష్ణా.. ఇటు గోదావరిలో యేటా వందల టీఎంసీల నీటిని అక్రమంగా ఎత్తుకెళ్తున్న ఏపీ.. కీలక ప్రాజెక్టులకూ గండికొడ్తున్నది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు రూపంలో శ్రీశైలం రిజర్వాయర్​అడుగునీటిని కొల్లగొడ్తున్న  పొరుగు రాష్ట్రం..  ఇప్పుడు నాగార్జునసాగర్ నీళ్లకూ ఎసరుపెట్టింది. సాగర్​రిజర్వాయర్​ నుంచి రోజూ 2 టీఎంసీల నీటిని తరలించేలా రహస్యంగా సొరంగ నిర్మాణం చేపట్టింది. విభజన చట్టానికి తూట్లు పొడుస్తూ తెలంగాణకుగానీ, కృష్ణా బోర్డుకుగానీ  కనీస సమాచారం ఇవ్వకుండా దొడ్డిదారిన పనులు కొనసాగిస్తున్నది.  

తాగునీటి అవసరాల సాకుతో  ఏపీ చేపట్టిన ఈ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన కేంద్రం ‘జల్​జీవన్​ మిషన్’​ కింద నిధులు ఇచ్చి సహకరిస్తున్నది. ఓవైపు తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టే ‘బనకచర్ల’ ప్రాజెక్టు పర్మిషన్ల కోసం ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఇది చాలదన్నట్లు మరోవైపు గుట్టుగా సాగర్​కే గండి కొడ్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

సాగర్​ అడుగు నీటికీ ఎసరు.. 

శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ఏటా 34 టీఎంసీలు మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. కానీ  నిరుడు పోతిరెడ్డిపాడు నుంచి 200 టీఎంసీల దాకా తోడుకున్న పొరుగు రాష్ట్రం.. ఈ ఏడాది కరువు సీజన్​లోనూ 40 టీఎంసీలకుపైగా తరలించింది. కుండకు అడుగున పొక్కకొట్టినట్లు శ్రీశైలం అట్టడుగు నుంచి నీటిని ఎత్తుకెళ్లేందుకు రాయలసీమ లిఫ్ట్​నూ తలపెట్టింది. కానీ తెలంగాణ సర్కారు పోరాటంతో దానికి బ్రేక్​ పడింది. ఇప్పుడు ఏపీ కన్ను నాగార్జునసాగర్​ మీద పడింది. 

ఈ ప్రాజెక్ట్​ డెడ్​ స్టోరేజీలోనే కాదు.. అడుగున ఉన్న బురదనూ తరలించేంతలా భారీ గండి కొడ్తున్నది.  సాగర్​ ప్రాజెక్ట్​ 149 అడుగుల మట్టం  నుంచే.. (అంటే డెడ్​ స్టోరేజ్ 510 అడుగులకు దిగువ నుంచి)  నీటిని తరలించుకునేలా డ్యామ్ కుడివైపున విజయపురి సౌత్ ప్రాంతంలో రూ.1,200 కోట్ల వ్యయంతో గుట్టుగా సొరంగం (టన్నెల్) తవ్వుతున్నది. దానికి సంబంధించి ఈ ఏడాది ఆగస్టు 4న రహస్యంగా జీవో ఇచ్చింది. ‘జల్​ జీవన్​ మిషన్’​ కింద 8 జిల్లాలకు తాగునీటి అవసరాల పేరుతో రోజుకు 1.865 టీఎంసీల నీటిని తరలించేంత సామర్థ్యంతో ఇన్‌టేక్ వెల్​, టన్నెల్, పైప్‌లైన్ పనులను కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య చేపడ్తున్నది. 

ఈ క్రమంలో ఇప్పటికే కొంత  మేర పైప్​లైన్​ పనులు కూడా పూర్తయ్యాయని తెలుస్తున్నది. అటువైపు ఎవరినీ రానివ్వడం లేదు. ఈ ప్రాజెక్టును కేవలం 8 నెలల్లోనే పూర్తి చేసి వచ్చే ఏడాది వాటర్​ ఇయర్​ నుంచే నీటి తరలింపు మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నది.  ఏపీ విభజన చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు చేపట్టామని ఏపీ చెప్తున్నా..  ఆ చట్టంలో భాగమైన తెలంగాణకు కనీస సమాచారం ఇవ్వలేదు. 

నాగార్జున సాగర్ ​యజమాని మనమే.. కానీ.. 

విభజన చట్టం ప్రకారం ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్​ల నిర్వహణపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. శ్రీశైలం నిర్వహణను ఏపీకి, నాగార్జునసాగర్​ నిర్వహణను తెలంగాణకు అప్పజెప్పింది. కానీ, సాగర్​ ప్రాజెక్టు మనకు దక్కితే ఏపీ ఆటలు సాగవన్న ఉద్దేశంతో ఆ రాష్ట్రం.. తనవైపు భాగాన్ని మొత్తం ఆక్రమించేసింది. తెలంగాణ అధికారులను కనీసం అటువైపు రానివ్వడం లేదు. చెకింగ్​ కోసం వెళ్తే గొడవలకు దిగుతున్నది. దాడులు చేయిస్తున్నది. 2023 ఎన్నికలకు ముందు జరిగిన ఘర్షణలే అందుకు నిదర్శనం. 

మన అధీనంలో ఉండాల్సిన ప్రాజెక్టును మనకు కాకుండా చేసేసి.. సాగర్​ ప్రాజెక్టునూ ఖాళీ చేయాలన్న దుర్బుద్ధితో ఏపీ ఇలా అక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి సాగర్​ ప్రాజెక్టులోనూ తెలంగాణకు అన్యాయమే జరిగింది. ఇప్పటికే ఏపీ వైపు కుడి కాల్వ ద్వారా డెడ్​ స్టోరేజ్​ దిగువ నుంచి కూడా ఆ రాష్ట్రం నీటిని తీసుకుపోవడానికి వీలుంది. మనకు మాత్రం ఎక్కడో దూరంగా కొండల్లో హెడ్​ రెగ్యులేటర్​ను నిర్మించి ఇచ్చారు. 

సాగర్​ నీటి మట్టం 510 అడుగులకు పడిపోతే.. మనం మోటార్లు పెట్టి నీటిని తరలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ, ఏపీ మాత్రం ఎంచక్కా 149 అడుగుల మట్టం నుంచి కూడా గ్రావిటీ ద్వారానే వందల టీఎంసీల నీళ్లను మళ్లించుకునే ఏర్పాట్లు చేసుకుంటుండడం కలవరపెడ్తున్నది.

ఆగని ‘బనకచర్ల’  వ్యూహాలు.. 

గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్లే వరద జలాల పేరిట 200 టీఎంసీలను తరలించేందుకు ఏపీ  ‘పోలవరం–బనకచర్ల’ లింక్ ప్రాజెక్టును తలపెట్టింది. కేంద్ర పర్యావరణ శాఖ ఈ ప్రాజెక్టు ‘టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్’ ను వెనక్కి పంపినా, సీడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వకపోయినా.. చంద్రబాబు మాత్రం వెనక్కి తగ్గకుండా పావులు కదుపుతున్నారు. ఒకవైపు రూ.81,800 కోట్ల బనకచర్ల ప్రాజెక్టులో మొదటి దశను రూ.58,700 కోట్ల వ్యయంతో ‘పోలవరం–నల్లమల సాగర్’గా పేరు మార్చి బొల్లాపల్లి రిజర్వాయర్ మీదుగా మళ్లింపునకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 

మరోవైపు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి అనుమతుల కోసం ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా ఈ నెల12, 13 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన 31వ సీఐఐ పార్ట్​నర్‌ షిప్ సదస్సు–2026 వేదికపైనా చంద్రబాబు మళ్లీ ‘బనకచర్ల’ అజెండాను బలంగా వినిపించారు. దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు, కేంద్ర మంత్రుల సమక్షంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికి అంకితం చేస్తాం. 

గోదావరి–కావేరి నదుల అనుసంధానం ఒక్కటే పెండింగ్‌లో ఉంది. పోలవరం నుంచి బనకచర్ల మీదుగా గోదావరి–కావేరి అనుసంధానం పూర్తయితే 5 నదులు, 4 రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు ఉండవు, ప్రధాని మోదీ మాత్రమే దీన్ని చేయగలరు’’ అని వ్యాఖ్యానించారు. ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు కూడా అదే సీఐఐ సదస్సులో పోలవరం బనకచర్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రాధాన్యమని తేల్చి చెప్పడాన్ని బట్టి అక్కడి ప్రభుత్వం  ఎంత సీరియస్​గా ఉందో అర్థంచేసుకోవచ్చు.

బనకచర్ల కోసమే ‘సమ్మక్కసాగర్’ డీపీఆర్ వెనక్కి పంపారా?

ఏపీ బనకచర్ల ప్రాజెక్టును పట్టాలెక్కించే కుట్రలో భాగంగానే తెలంగాణకు చెందిన  సమ్మక్కసాగర్ బ్యారేజీ డీపీఆర్‌ను సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ) వెనక్కి పంపిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 46.96 టీఎంసీల గోదావరి జలాలను ఉపయోగించుకుని 4.40 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 30 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చేలా రూపొందించిన సమ్మక్కసాగర్ డీపీఆర్‌ను నవంబర్ 10న వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. 100 శాతం కమాండ్ ఏరియా సర్వే వివరాలు లేవని, సీడీవో సర్టిఫికెట్ లేదని సాంకేతిక కారణాలు చూపినప్పటికీ.. దీని వెనుక అసలు కారణం ‘గోదావరి–కావేరి (జీసీ) లింక్’–‘పోలవరం–బనకచర్ల’ కుట్రేనన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 

గతంలో నేషనల్​ వాటర్​ డెవలప్​మెంట్​ ఏజెన్సీ (ఎన్​డబ్ల్యూడీఏ) మన రాష్ట్రంలోని ఇచ్చంపల్లి లేదా సమ్మక్కసాగర్ నుంచి 148 టీఎంసీల నీటిని తరలించేలా గోదావరి–కావేరి అనుసంధానాన్ని ప్రతిపాదించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక ఓకే చెప్పినా.. ఏపీ మాత్రం అడ్డం పడుతున్నది. ఇచ్చంపల్లి లేదా సమ్మక్కసాగర్ నుంచి నీళ్లు మళ్లిస్తే తమ పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు దెబ్బ తగులుతుందని భావించిన చంద్రబాబు.. ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖలు రాశారు. సమ్మక్కసాగర్‌కు సీడబ్ల్యూసీ అనుమతులు వస్తే భవిష్యత్తులో బనకచర్ల వద్ద నీటి లభ్యత లేదన్న వాదన బలపడుతుందనే, కావాలనే సమ్మక్కసాగర్ డీపీఆర్‌ను కేంద్రం తొక్కిపెట్టి వెనక్కి పంపిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎస్​ఈకి ముందే తెలిసినా సైలెన్స్​! 

తెలంగాణ యాజమాన్యంలో ఉన్న నాగార్జున సాగర్​లో ఏపీ చేపడుతున్న ప్రాజెక్టుపై తమకు ఎలాంటి సమాచారం లేదని ప్రభుత్వానికి ఇచ్చిన తాజా నివేదికలో తెలంగాణ ఇరిగేషన్​ అధికారులు చెప్పడం విస్మయం కలిగిస్తున్నది. వాస్తవానికి ఏపీ వైపు సొరంగం పనులు జరుగుతున్న విషయం సాగర్​ ప్రాజెక్ట్​ ఎస్​ఈకి ముందే తెలుసని, కానీ కావాలనే దాచిపెట్టాడని విశ్వసనీయంగా తెలిసింది. ఏపీవైపు జరుగుతున్న సొరంగం పనుల పై సాగర్​ ఈఈ మూడు నెలల కిందే ప్రాజెక్ట్​ ఎస్​ఈని అలర్ట్​ చేశారని, కానీ అది పెద్ద విషయమేమీ కాదన్నట్లు సదరు ఎస్​ఈ.. ఈఈ నోరు మూయించినట్టు సమాచారం. 

ఉన్నతాధికారులకు చెప్పకుండా ఈఈని ఎస్​ఈ వారించినట్లు ప్రచారం జరుగుతోంది. సాగర్​ ప్రాజెక్టు డెడ్​స్టోరేజ్​కి గండి కొడుతున్నా ఎస్​ఈ ఎందుకు మౌనంగా ఉన్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది.  ఎస్​ఈ ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు కావడం వల్లే అక్కడి ప్రభుత్వానికి సహకరించారని ఇరిగేషన్​వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 

కమిటీల పేరిట కాలయాపన.. మరిన్ని వివాదాలకు ఆజ్యం

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరిస్తామంటూ కేంద్ర జల్‌శక్తి శాఖ 2026 జనవరి 2న సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన 13 మంది సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మూడు నెలల్లో నివేదిక ఇచ్చి సమస్యలు తేల్చాలని ఆదేశించినా, 10 నెలలు గడిచినా ఒక్క వివాదమూ కొలిక్కి రాలేదు. అటు కృష్ణా ట్రైబ్యునల్ గడువును పొడిగించినా, అటు కేఆర్‌ఎంబీ సమావేశాలు వాయిదా పడుతున్నా ఏపీ అక్రమాలను ఆపే దిక్కులేదు. సెప్టెంబర్​ 7న ఢిల్లీలో సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఏపీ అధికారులు కొత్త రాగం అందుకున్నారు. 

2023 నాటి గోదావరి నీటి లభ్యత అంచనాలను ప్రశ్నిస్తూ మళ్లీ కొత్తగా అధ్యయనం చేయాలని డిమాండ్ చేయడమే కాకుండా, తెలంగాణ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిల్వ సామర్థ్యంపైనా కొర్రీలు పెట్టారు. కేంద్రం వేసిన కమిటీ వివాదాలను పరిష్కరించకపోగా.. అనుమతుల్లేని పోలవరం–బనకచర్ల అంశాన్ని ఎజెండాలోకి తెచ్చి, ఏపీకి కావాల్సినంత సమయం ఇస్తూ మరిన్ని కొత్త తగాదాలకు ఆజ్యం పోస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.