- ప్రమాదం జరిగిన రోజు నుంచి 7 రోజులు క్యాష్‌లెస్
- పీఎం–రాహత్‌లో సర్కారీ మెడికల్ కాలేజీలూ చేరాలె
- గోల్డెన్ అవర్‌లో చిన్న దవాఖానల్లోనూ ప్రాథమిక చికిత్స
- హైవేలు, బ్లాక్‌స్పాట్ల దగ్గరి దవాఖానలకు ప్రాధాన్యం
- ఇతర హెల్త్ స్కీముల కన్నా పీఎం రాహత్ కే ప్రయారిటీ
- అక్రమాలకు పాల్పడితే బ్లాక్‌లిస్ట్‌లోకి దవాఖానలు
హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాద బాధితులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా వెంటనే వైద్యం అందించేందుకు కేంద్రం అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్‌మెంట్’ (పీఎం–రాహత్) స్కీమ్‌లో దేశంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ దవాఖానలు చేరాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కోరింది. ఈ మేరకు పబ్లిక్ నోటీసుతో పాటు నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) రూపొందించిన గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఈ స్కీమ్ కింద మోటారు వాహన ప్రమాద బాధితులకు ప్రమాదం జరిగిన రోజు నుంచి గరిష్ఠంగా 7 రోజుల పాటు రూ.1.50 లక్షల వరకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ అందుతుంది.
గోల్డెన్ అవర్‌పై ఫోకస్
ప్రమాదం జరిగిన మొదటి గంట (గోల్డెన్ అవర్)లోనే చికిత్స అందించి ప్రాణాలు కాపాడటమే ఈ స్కీమ్ ప్రధాన లక్ష్యం. అందుకే యాక్సిడెంట్ బ్లాక్‌స్పాట్లు, నేషనల్, స్టేట్ హైవేలు, మున్సిపల్ రోడ్ల సమీపంలోని దవాఖానలను స్కీమ్‌లో చేర్చడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎన్‌హెచ్‌ఏ గైడ్‌లైన్స్ ప్రకారం మూడు కేటగిరీల దవాఖానల ద్వారా బాధితులకు సేవలు అందుతాయి:
ఆయుష్మాన్ భారత్ దవాఖానలు
ఏబీ పీఎం–జేఏవైలో ఉన్న దవాఖానలన్నీ ప్రత్యేక దరఖాస్తు లేకుండానే ఆటోమేటిక్‌గా అర్హత పొందుతాయి. అనుమతి ఉన్న స్పెషాలిటీ విభాగాల మేరకు చికిత్సతో పాటు అంబులెన్స్ సేవలు అందిస్తాయి. కేంద్ర పథకం కింద ఉన్న ట్రామా, బర్న్ యూనిట్లు కూడా ఆయుష్మాన్ భారత్‌లో చేరాలి.
పీఎం–రాహత్ ఓన్లీ
ఆయుష్మాన్ భారత్‌లో లేని పెద్ద దవాఖానలు ఈ కేటగిరీలో చేరి 202 ప్యాకేజీలు, అంబులెన్స్ సేవలు అందించొచ్చు.
పీఎం–రాహత్ లైట్
పెద్ద ట్రామా వసతులు లేని చిన్న దవాఖానలు ఈ కేటగిరీలో రిజిస్టర్ అయి గోల్డెన్ అవర్‌లో ప్రాథమిక స్టెబిలైజేషన్ చికిత్స అందిస్తాయి. ఆ తర్వాత బాధితులను మెరుగైన వైద్యం కోసం పెద్ద దవాఖానలకు రిఫర్ చేస్తాయి. వీటికి స్టెబిలైజేషన్, అంబులెన్స్ ప్యాకేజీలు వర్తిస్తాయి.
24 గంటల ఎమర్జెన్సీ తప్పనిసరి
స్కీమ్‌లో చేరే దవాఖానల్లో ట్రామా కేర్, ఎమర్జెన్సీ లేదా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ విభాగాలు కచ్చితంగా ఉండాలని ఎన్‌హెచ్‌ఏ స్పష్టం చేసింది. అర్హతను బట్టి బర్న్స్, న్యూరో సర్జరీ, కార్డియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఈఎన్‌టీ, కంటి, చిన్నపిల్లల వైద్యం వంటి ప్రత్యేక సేవలు కూడా అందుతాయి. 24 గంటల ఎమర్జెన్సీ వార్డు, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, ఎక్స్‌రే, సీటీ, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ స్కానింగ్, బ్లడ్ బ్యాంక్, అంబులెన్స్ సేవలు తప్పనిసరి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇతర హెల్త్ స్కీములు ఉన్నా, రోడ్డు ప్రమాద బాధితులకు మాత్రం పీఎం–రాహత్‌కే మొదటి ప్రాధాన్యం ఉంటుంది.
అక్రమాలకు పాల్పడితే బ్లాక్‌లిస్ట్
స్కీమ్ అమలును రాష్ట్ర స్థాయిలో స్టేట్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్, జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ పర్యవేక్షిస్తాయి. వైద్యంలో నిర్లక్ష్యం వహించినా, నిబంధనలు ఉల్లంఘించినా, అక్రమాలకు పాల్పడినా దవాఖానలపై జరిమానా, బిల్లుల నిలిపివేత, సస్పెన్షన్, డీ–ఎంపానెల్‌మెంట్, బ్లాక్‌లిస్ట్ వంటి చర్యలు తీసుకుంటారు. ఆయుష్మాన్ భారత్ నుంచి తొలగించిన దవాఖానలు పీఎం–రాహత్ నుంచి కూడా ఆటోమేటిక్‌గా రద్దవుతాయి.
