ముద్రా రుణాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును మల్కాజిగిరి పోలీసులు రట్టు చేశారు. రూ.11.50 లక్షల రుణం ఇప్పిస్తామని నమ్మించి ఓ వ్యాపారవేత్త నుంచి రూ.4,67,800 వసూలు చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం.. బాధిత వ్యాపారవేత్త ఫేస్‌బుక్‌లో ముద్రా లోన్‌కు సంబంధించిన ప్రకటనను చూసి రుణం కోసం సంప్రదించాడు. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ ముఠా సభ్యులు రూ.11.50 లక్షల రుణం మంజూరు చేయిస్తామని నమ్మించారు. అనంతరం బాధితుడి నుంచి ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను సేకరించారు.
రుణం మంజూరు చేయడానికి ప్రాసెసింగ్ ఫీజు, టీడీఎస్, ఆర్బీఐ ఫీజులు చెల్లించాలంటూ విడతలవారీగా డబ్బులు వసూలు చేశారు. ఇలా మొత్తం రూ.4,67,800 తీసుకుని మోసానికి పాల్పడ్డారు.
కమీషన్ల కోసం బ్యాంకు ఖాతాలు..
ఈ మోసంలో బ్యాంకు ఖాతాలు కీలకంగా ఉపయోగించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కమీషన్ల ఆశతో కొందరు నిందితులు తమ బ్యాంకు ఖాతాలను ముఠాకు అందించినట్లు గుర్తించారు. ఢిల్లీ, బీహార్ ప్రాంతాల నుంచి తెలుగు మాట్లాడే రుణ దరఖాస్తుదారులకు ఫోన్లు చేసి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో బీహార్‌కు చెందిన మనీష్, ఆకాష్‌లను ప్రధాన నిందితులుగా గుర్తించారు.కేసును ఛేదించిన మల్కాజిగిరి పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు ఆటో డ్రైవర్లు, ఒక పెయింటర్, ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నారు. నిందితుల నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రెండు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసంతో సంబంధం ఉన్న మరో ఇద్దరు పరారీలో ఉండటంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ ముఠా బ్యాంకు ఖాతాల ద్వారా జరిపిన లావాదేవీలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే తరహాలో మరికొందరు బాధితులు మోసపోయారా? అనే కోణంలోనూ విచారణ చేపట్టారు.
